పంజాబ్ తరహాలో ఇక్కడా ధాన్యం కొనాల్సిందే..బీజేపీ, మోదీతో తెలంగాణకు అన్యాయం రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వలేకనే కుట్రలురాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిశాశ్వత పరిష్కారం చూపేదాకా ఉద్యమిద్దామని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపుఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నాహక సమావేశాలు యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ సునీత,
భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు
‘రాష్ట్రంలో పండిన ప్రతి వరి గింజనూ కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే. అప్పటివరకూ రైతుల పక్షాన టీఆర్ఎస్ అలుపెరుగని పోరాటం చేస్తుంది’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. పంజాబ్ తరహాలో తెలంగాణ వడ్లను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం టీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. శాలిగౌరారం, నకిరేకల్, నల్లగొండలో స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన జరిగాయి. సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాకలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. యాదగిరి గుట్టలో జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, నిరంతర ఉచిత విద్యుత్‌తో ధాన్యం దిగుబడిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ సర్కారు కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచైనా ధాన్యం కొనుగోలు చేయిస్తామని, అందుకు అందరూ కలిసిరావాలని కోరారు.
సంస్థాన్ నారాయణపురం, మార్చి 24 : రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేకుంటే రాజీ లేని పోరాటాలు చేస్తామని విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని పుట్టపాక గ్రామంలో ఎస్వీఎస్ గార్డెన్స్‌లో గురువారం నిర్వహించిన టీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. పంజాబ్ మాదిరి తెలంగాణలో ఎలాంటి షరుతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర మంత్రులు, ప్రధాని దోబూచులాడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని ముంచే ప్రయత్నం చేస్తున్నదన్నారు. రైతులు ఆత్మాభిమానంతో బతకాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం రైతులపై కక్ష గట్టి వారి నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నదన్నారు. కరోనా సంక్షోభంలో సైతం తెలంగాణ రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను కొనుగోలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు, విద్యుత్ చట్టాలు తెచ్చి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు. బీజేపీ మాట్లాడేది దేశభక్తి.. చేసేది దేశద్రోహం అని దుయ్యబట్టారు. వాట్సాప్ వర్సిటీ అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలు, రైతులను మోసం చేస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ, రక్షణ, విద్యుత్ రంగాన్ని ప్రైవేట్‌పరం చేయాడానికి ప్రయత్నాలు ప్రారంభించదన్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు రావాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. బీజేపీది రాజకీయ ఆరాటం, సీఎం కేసీఆర్‌ది తెలంగాణ ప్రజల బతుకు దెరువు పోరాటం అని పేర్కొన్నారు.
2104కు ముందు తెలంగాణలో పరిస్థితులు దారుణంగా ఉండేవని సీఎం కేసీఆర్ పగ్గాలు చేపట్టాకే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని అన్నారు. పక్క రాష్ర్టాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకుని పాలన సాగిస్తున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ కేంద్రంపై చేస్తున్న పోరాటాలకు కార్యకర్తలు, నాయకులు అండగా నిలబడాలని కోరారు. అనంతరం నియోజకవర్గంలో లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ పీఏసీఎస్ చైర్మన్లకు జీతాలు పెంచడాన్ని హర్షిస్తూ పీఏసీఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, ఎంపీపీలు గుత్తా ఉమాదేవి, తాడూరి వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
శాలిగౌరారం/కట్టంగూర్(నకిరేకల్) : యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కేంద్రమే కొనుగోలు చేయాలని, లేదంటే మరో క్విట్ ఇండియాలా ఉద్యమించాల్సి వస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం శాలిగౌరారంలో తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అధ్యక్షతన, నకిరేకల్‌లో నకిరేకల్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన వేర్వేరుగా జరిగాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. 2014కు ముందు రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేక పడావుబడిన భూములను చూస్తూ అన్నమో రామచంద్రా అంటూ అరిగోస పడిన రైతన్నలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక వారికి విముక్తి కలిగించిన దేవుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 24గంటల కరెంట్ సరఫరా చేస్తూ పం ట పెట్టుబడికి రైతుబంధు అందిస్తున్న క్రమంలో రైతులు అత్యధిక వడ్లు పండిస్తున్నారని, దీనిని చూసి ఓర్వలేని బీజేపీ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నుతుందన్నారు. ఆహారభద్రత చట్టం ప్రకారం రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను కేంద్రమే కొనాలి, కానీ కొనకుండా కొర్రీలు పెడుతూ రైతుల నడ్డి విరుస్తుందని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నేటివరకు 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక మాట్లాడుతూ వడ్లు కొనేదాకా కొట్లాడుడే అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి బీజేపీ భయపడుతుందని పేర్కొన్నారు. ఆయా సమావేశాల్లో జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్, ఎంపీపీలు గంట లక్ష్మమ్మ, సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, కొలను సునీత, జడ్పీటీసీలు ఎర్ర రణీలాయాదగిరి, మాద ధనలక్ష్మి, తరాల బలరాములు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు కట్టా లక్ష్మీవెంకట్‌రెడ్డి, ఉమారాణి, జడల మల్లయ్య, మున్సిపల్ చైర్మన్లు రాజకొండ శ్రీనివాస్, కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్, రైతుంబంధు సమితి మండల కన్వీనర్ గుండా శ్రీనివాస్, సర్పంచ్ బట్ట హరిత, ఎంపీటీసీ కొత్త శంకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు నూక సైదులు, మహేందర్‌రెడ్డి, నాయకులు హతీశ్రెడ్డి, సర్వయ్య, నాగరాజుగౌడ్, వేణుగోపాల్‌రెడ్డి, వీరభద్రయ్య పాల్గొన్నారు.