హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ తీరుపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ అధికారులు రగిలిపోతున్నారు. 38 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇలా వేధింపులకు దిగితే భవిష్యత్‌లో ప్రాజెక్టులేవీ ముందుకుసాగని పరిస్థితి నెలకొంటుందని హెచ్చరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన విజిలెన్స్ కమిషన్ గత మార్చిలో నివేదిక సమర్పించింది.
17 మంది ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లపై క్రిమినల్ ప్రొసీడింగ్స్, మరో 40 మంది ఇంజినీర్లపై మేజర్ పెనాల్టీ ప్రొసీడింగ్స్ చేపట్టాలని రిపోర్టులో పేర్కొన్నది. ఆ నివేదిక ఆధారంగా ఇంజినీర్లపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. కమిషన్ నివేదించిన రిపోర్టులోని ఇంజినీర్లు అందరికీ కాకుండా 38 మంది ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. విజిలెన్స్ కమిషన్ మోపిన అభియోగాలపై వచ్చే మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఇంజినీర్లను ఆదేశించింది.
ఈ చర్యలపై ఇరిగేషన్ శాఖ అధికారులు భగ్గుమంటున్నారు. కమిషన్ తీరుపై, సర్కారు చర్యలపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. వాస్తవంగా విజిలెన్స్ కమిషన్‌లో ఇరిగేషన్, పంచాయతీ, ఆర్అండ్బీ తదితర ఇంజినీరింగ్ విభాగాల నుంచి ఇంజినీర్లు ఉండాల్సి ఉన్నది. ఇక విజిలెన్స్ కమిషన్‌లో సీఈ పోస్టుతోపాటు దిగువన ఏఈ, జేఈ మొత్తం పోస్టులన్నింటిలోనూ ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లే ఉండాలి. కానీ, ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ నుంచి కమిషన్‌లో ఒకేఒక్క అధికారి ఉండగా మిగతా అన్ని పోస్టుల్లో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఇంజినీర్లు ఉన్నారు.
మరోవైపు, రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు అతిభారీ ప్రాజెక్టు. చీఫ్ ఇంజినీర్లు, హైపవర్ కమిటీ, స్టేట్‌లెవల్ స్టాండింగ్ కమిటీల్లో సీఈలే ఉన్నారు. అలాంటి ఉన్నత కమిటీలు, సీఈలు రూపకల్పన చేసి, ఆమోదించిన ప్రాజెక్టుపై ఈఈ, డీఈ వంటి దిగువస్థాయి, అందులోనూ ఇరిగేషన్ శాఖతో సంబంధమే లేని పీఆర్, ఆర్అండ్బీ అధికారులతో విచారణ చేయించడమే విడ్డూరమని, దానిపై రాష్ట్ర సర్కారు సైతం అనాలోచితంగా చర్యలకు దిగడమేమిటని ఇంజినీర్లు మండిపడుతున్నారు.
కమిషన్ పూర్తిగా నిర్బంధం తరహాలో విచారణ కొనసాగించిందని వారంతా చెప్తున్నారు. విచారణకు పిలిచి అప్పటికప్పుడే సమాధానాలు ఇవ్వాలని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించేందుకు సమయమివ్వాలని కోరినా పట్టించుకోకుండా, ఏది ఉంటే అదే రాసివ్వాలని పట్టుబట్టిందని వారంత గుర్తుచేశారు. విజిలెన్స్ కమిషన్ సాంకేతిక అంశాలపై విచారణ చేయడం, వాటిపై అనుమానాలు ఉంటే, లోపాలేమైనా కనిపిస్తే సదరు అధికారి నుంచి వివరణలు తీసుకోవడం పరిపాటి అని, అవి సహేతుకంగా ఉంటే అభియోగాలను తొలగించడం రొటీన్‌గా కొనసాగుతుందని ఆ అధికారులు చెప్తున్నారు.
కానీ, విజిలెన్స్ కమిషన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని, అభియోగాలు మోపడమే లక్ష్యంగా ముందుకుపోతున్నదని, ఎన్నిసార్లు ఆధారాలతో వివరణలు ఇచ్చినా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని ఇంజినీర్లు మండిపడుతున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా కమిషన్ మోపిన అభియోగాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం షోకాజ్ నోటీసులివ్వడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సర్కారు తీరు మారకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, పనులు చేయడానికి ఇంజినీర్లు ముందుకురాని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.