Home Loans Costly | వివిధ రుణాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) కీలక వడ్డీరేట్లు పెంచేశాయి. దీంతో ఇండ్ల రుణాలతోపాటు పర్సనల్, ఆటోమొబైల్, వ్యాపార రుణాలు పిరం కానున్నాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) పది బేసిక్ పాయింట్లు (0.10 శాతం) పెంచేశాయి. అన్ని రకాల టెన్యూర్ రుణాలపై వడ్డీరేట్ల పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని శనివారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తెలిపింది. తమ రుణాలపై పెరిగిన ఎంసీఎల్ఆర్ సోమవారం (2022, సెప్టెంబర్ 12) నుంచి అమలవుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది.
కార్లు, పర్సనల్, ఇండ్ల రుణాలపై ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) ఏడాది టెన్యూర్ గల ఎంసీఎల్ఆర్ 7.65 నుంచి 7.75 శాతానికి పెరుగుతుంది. రెండేండ్ల గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.80 శాతానికి చేరుతుంది. ఓవర్‌నైట్ టెన్యూర్ రుణాలపై 7.05, నెల రోజుల గడువు గల లోన్‌పై 7.15, మూడు, ఆరు నెలల గడువు గల రుణాలపై 7.70 శాతం చొప్పున ఎంసీఎల్ఆర్ ఖరారవుతుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఐవోబీ వెల్లడించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఏడాది టెన్యూర్ రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.70 శాతం నుంచి 7.80 శాతానికి పెరుగుతుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఆరు నెలల గడువు గల రుణాలపై 7.55 నుంచి 7.65 శాతానికి, మూడు నెలల టెన్యూర్ రుణాలపై 7.45 నుంచి 7.50 శాతానికి ఎంసీఎల్ఆర్ పెరుగుతుందని బీవోబీ పేర్కొంది.