సిసిసి నస్పూర్ : ఇంటర్ సప్లమెంటరీ ( Inter supplementary ) పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురైl ఇంటర్ విద్యార్థిని కోటోజి అక్షయ (16) ఉరివేసుకొని ఆత్మహత్యకు ( Student Suicide) పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్పూర్ పట్టణంలోని జయశంకర్ కాలనికి చెందిన కోటోజి కృష్ణ- ప్రమీల దంపతులకు ఇద్దరు కుమార్తెలు అమూల్య, అక్షయ ఉన్నారు.
పెద్ద కుమార్తె హైదరాబాదులో డిగ్రీ చదువుకుంటుండగా, చిన్న కూతురు అక్షయ నస్పూర్‌లోని కస్తూర్బా గాంధీ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ (MPC) చదివింది. అయితే ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మాథ్స్ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో సప్లమెంటరీ పరీక్షలు రాసింది. ప్రభుత్వం సోమవారం ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు ప్రకటించింది. సప్లమెంటరీ పరీక్షల్లో కూడా ఆమె మరోసారి ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఆమె ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
మధ్యాహ్నం ఫలితాలు వచ్చిన తర్వాత కేజీబీవీ కళాశాల నుంచి ఉపాధ్యాయురాలు తల్లి ప్రమీలకు అక్షయ ఫెయిల్ అయినట్లు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే తల్లి అక్షయకు కాల్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తల్లికి అనుమానం వచ్చి భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆయన వెంటనే ఇంటికి వెళ్లి చూసేసరికి అక్షయ ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. స్థానికులు 108కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అక్షయ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
తల్లి సిసిసి నస్పూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు పనిచేస్తుండగా, తండ్రి సిసిసి కార్నర్ సమీపంలో కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. చిన్న కూతురు అక్షయ ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు సిసిసి నస్పూర్ ఎస్సై ఉపేందర్ రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.