బాన్సువాడ : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ (Mahesh Kumar Goud ) ఆరోపించారు. బీజేపీ తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా అని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బాన్సువాడలో పట్టభద్రులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ (Utterpradesh), బీహార్ (Bihar) , ఆంధ్రప్రదేశ్ కు లక్షల కోట్లు ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు, మరో ఇద్దరు బీజేపీ ఎంపీలున్నా గాని రాష్ట్రానికి ప్రత్యేక నిధులు సాధించలేకపోయారని విమర్శించారు.
2014 లో నరేంద్ర మోదీ ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఉన్న ఉద్యోగాలను పీకేశారని దుయ్యబట్టారు. ఆ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాట నిల బెట్టుకుంటామని వెల్లడించారు. ఉన్న ఉద్యోగాలు పీకేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి కార్పొరేట్ వాళ్లకు అప్పజెప్పారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ,రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసర్ల బాలరాజు, ఎంపీ సురేష్ షెట్కర్, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి , మధుసూదన్ రెడ్డి, ఎజాజ్, ఖాలిక్, పిట్ల శ్రీధర్, మోహన్ నాయక్,పవన్ తదితరులు పాల్గొన్నారు.