Operation Sindoor | సిందూరం.. నుదుటన దిద్దితే తిలకం!పాపిట పెడితే.. సౌభాగ్యం!అదే ‘సిందూరం’ ఇండియన్ ఆర్మీ దిద్దుకుంటే అది వీరతిలకం!భారత సేన పరాక్రమ కాళిక అయ్యింది. పహల్గాంలో ఏప్రిల్ 22న 26మందిని ఊచకోత కోసిన ఉగ్రమూకల వెన్నువిరిచింది. సరిగ్గా 15 రోజులకు బద్లా తీర్చుకున్నది. మంగళవారం నడిరాత్రి తర్వాత మెరుపుదాడితో భారత్ ఆటంకవాదుల అంతుచూసింది. పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ క్షిపణులతో విరుచుకుపడింది. ఉగ్రసామ్రాజ్యపు ఆయువుపట్టు మీద చావుదెబ్బ కొట్టింది. పాక్ పీచమణిచింది. పహల్గాంలో ఆడబిడ్డలు కోల్పోయిన మాంగల్యానికి.. ఉగ్రవాదుల రుధిరధారల మధ్య తీర్చుకున్న ఈ ప్రతీకారానికి పెట్టిన పేరు ‘ఆపరేషన్ సిందూర్’!
ఉన్మాదుల దాడి మహిళలకు కన్నీళ్లను మిగిల్చితే.. దానికి అదే నారీశక్తితో భారత్ బదులిచ్చింది. సశస్త్ర బలగాల మీడియా బ్రీఫింగ్‌కు మహిళా సైనికాధికారులే నేతృత్వం వహించడం ‘ఆపరేషన్ సిందూర్’ను మరింత సార్థకం చేసింది. ఉగ్రమూకల్ని సైన్యం ఎలా మట్టుబెట్టిందో ఆర్మీ కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ మీడియాకు వివరిస్తుంటే సైనిక దుస్తుల్లోని ‘ఆదిపరాశక్తులు’గా కనిపించారు. సైన్యం సాహసానికి దేశం జేజేలు పలికింది. సంఘీభావ సందేశాలతో మాధ్యమాలన్నీ హోరెత్తాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): పహల్గాం ఉగ్రదాడిలో భారత ఆడపడుచుల సిందూరాన్ని తుడిచేసిన ముష్కర మూకలకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని తొమ్మిది ఉగ్ర శిబిరాలపై అత్యంత కచ్చితత్వంతో మెరుపు దాడులు చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు దూరంలో జరిగిన ఈ దాడుల్లో 80 మంది వరకూ ఉగ్రవాదులు హతమవ్వగా, మరో 60 మందికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. 1971 యుద్ధం తర్వాత త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన అతిపెద్ద జాయింట్ ఆపరేషన్ ఇదే. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను బుధవారం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌తో కలిసి మీడియా సమావేశంలో వెల్లడించారు. కాగా ఉగ్ర మూకలకు భారత్ గుణపాఠం చెప్పాయని యావత్తు ప్రజానీకం ముక్తకంఠంతో నినదించింది. ఈ దాడులతో తమకు న్యాయం జరిగిందని పహల్గాం బాధిత కుటుంబాలు వెల్లడించాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై పలు దేశాధినేతలతో పాటు ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్‌పై అంతర్జాతీయ మీడియా కూడా విస్తృతమైన కవరేజీ ఇచ్చింది. మరోవైపు, నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి పాక్ రేంజర్లు బుధవారం కూడా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 13 మంది భారత పౌరులు మృతి చెందగా.. 50 మందికిపైగా గాయపడినట్టు ఆర్మీ వెల్లడించింది.
25 మినిట్స్.. 9 క్యాంప్స్.. 24 స్ట్రైక్స్..
పహల్గాం దాడికి కారణమైన ఉగ్రమూకలను మట్టుబెట్టడమే లక్ష్యంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట మెరుపు దాడులు జరిపింది. మంగళవారం అర్ధరాత్రి 1.05 గంటల నుంచి 1.30 గంటల వరకూ 25 నిమిషాల పాటు కొనసాగిన 24 క్షిపణి, ఆత్మాహుతి డ్రోన్ దాడుల్లో పాకిస్థాన్‌లోని నాలుగు ఉగ్ర శిబిరాలు, పీవోకేలోని ఐదు ఉగ్ర స్థావరాలు తునాతునకలయ్యాయి. ఈ దాడుల్లో జైషే మహమ్మద్ (జేఈఎమ్)కు చెందిన నాలుగు ఉగ్రవాద శిబిరాలు, లష్కరే తాయిబాకు చెందిన 3 స్థావరాలు, హిజ్బుల్లాకు చెందిన రెండు ఉగ్ర శిబిరాలు ధ్వంసమైనట్టు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడుల్లో జేఈఎమ్ చీఫ్ మౌలానా మసూద్ కుటుంబానికి చెందిన పది మందితో పాటు నలుగురు సన్నిహితులు కూడా హతమయ్యారు. ఈ విషయాన్ని అజార్ కూడా ధ్రువపర్చారు. ఈ దాడుల్లోనే ఎల్ఈటీ చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా హతమయ్యాడంటూ వార్తలు వచ్చాయి. కాగా ఈ దాడులు యుద్ధ చర్యేనని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. గట్టిగా బదులిస్తామని తెలిపారు.
అలా చేస్తే మరింత తీవ్రంగా..
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్ర శిబిరాలనే ధ్వంసం చేశామని, పాక్ ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని భారత జాతీయ భద్రత సలహాదా రు అజిత్ దోవల్ తెలిపారు. ఉద్రిక్తతలను పెంచే ఉద్దే శం తమకు ఏమాత్రం లేదన్న ఆయన.. పరిస్థితులను తీవ్రం చేసేలా పాక్ వ్యవహరిస్తే.. భారత్ నుంచి ప్రతిస్పందన మరింత గట్టిగా ఉంటుందని హెచ్చరించా రు. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల భద్రతా సలహాదారులు, కార్యదర్శులకు ఆయన సమగ్రంగా వివరించారు. కేంద్రం గురువారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది.
దేశవ్యాప్తంగా హైఅలర్ట్
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో జమ్ము, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్సర్ సహా దేశవ్యాప్తంగా 18 విమానాశ్రయాలను మూసివేశారు. 200కు పైగా విమానాలను రద్దు చేశారు. యూపీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు రాష్ర్టాల సీఎంలతో బుధవారం అమిత్‌షా అత్యవసర భేటీ నిర్వహించారు. సెలవుల్లో ఉన్న పారామిలిటరీ బలగాలను వెనక్కిరమ్మని ఆయన ఆదేశించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసిన ప్రధాని మోదీ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అంతకుముందు జరిగిన క్యాబినెట్ భేటీలో మాట్లాడిన ప్రధాని.. ఆపరేషన్ సిందూర్‌పై స్పందిస్తూ మనందరం ఇది గర్వించదగ్గ క్షణమని పేర్కొన్నారు. దాడుల నేపథ్యంలో ప్రధాని విదేశీ పర్యటనలు రద్దయ్యాయి. మరోవైపు, పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సు సహా పలు ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మెడికల్ ఎమర్జెన్సీ విధించారు. సైన్యానికి సెలవులు రద్దు చేశారు. కర్తార్‌పూర్ కారిడార్‌తో పాటు ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లను మూసివేశారు. పాక్‌లోని భారత రాయబారికి అక్కడి ప్రభుత్వం సమన్లు జారీ చేసింది.
మనందరం గర్వించదగ్గ క్షణం భద్రతా దళాల చర్యపై ప్రధాని ప్రశంసలు
పాకిస్థాన్, పీవోకేలలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భద్రతా దళాలు చేపట్టిన సైనిక చర్యపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన కొద్ది గంటల్లోనే ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. సమావేశంలో ప్రధాని మోదీ సైనిక చర్యను కొనియాడారు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడంపై కేంద్ర క్యాబినెట్ హర్షం వ్యక్తం చేసింది. అంతకుముందు, ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతిని కేంద్ర క్యాబినెట్‌కు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలియజేశారు.
1.మర్కజ్ సుభాన్ (బహావల్పూర్)జైషే ఆపరేషనల్ హెడ్ క్వార్టర్సరిహద్దు నుంచి దూరం100 కి.
2.మీమర్కజ్ తాయిబా (మురిద్కే)లష్కరే తాయిబా క్యాంపు కార్యాలయం సరిహద్దు నుంచి దూరం30 కి.మీ
3.తెహ్రా కలాన్ (సర్జల్ క్యాంప్) జైషే మహమ్మద్ రవాణా క్యాంప్ సరిహద్దుకు దూరం: 8 కిలోమీటర్లు
4.మెహ్మూన్ జోయా (సియాల్కోట్) హిజ్బుల్ టెర్రర్ ఫోర్ట్ సరిహద్దు నుంచి దూరం 15 కి.మీ
5.మర్కజ్ అహ్లే హాదిత్ (బర్నాలా) లష్కరే తాయిబా ఆయుధాగారం సరిహద్దుకు దూరం: 10 కిలోమీటర్లు
6.మర్కజ్ అబ్బాస్ (కోట్లి) జైషే బాంబర్ క్యాంప్ సరిహద్దు నుంచి దూరం 35 కి.మీ
7.మస్కర్ రహీల్ షహీద్ (కోట్లి) హిజ్బుల్ ముజాహిదీన్ శిబిరం సరిహద్దు నుంచి దూరం 35 కి.మీ
8.షవాయ్ నల్లా (ముజఫరాబాద్) లష్కరే తాయిబా ట్రైనింగ్ క్యాంప్ సరిహద్దు నుంచి దూరం 30 కి.మీ
9.సయ్యద్నా బిలాల్(ముజఫరాబాద్) జైషే మహమ్మద్ రవాణా క్యాంప్ సరిహద్దుకు దూరం: 30 కిలోమీటర్లు