ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత్ సన్నాహం అదిరిపోయింది. స్వదేశం వేదికగా ఫిబ్రవరిలో జరిగే మెగాటోర్నీలో సత్తాచాటాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా అందుకు తగ్గట్లు దూసుకెళుతున్నది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన వేళ సిరీస్‌లో ఆఖరిదైన ఐదో పోరులో దక్షిణాఫ్రికాపై భారత్ భారీ విజయాన్నందుకుంది. అభిషేక్‌శర్మ, శాంసన్ మెరుపు శుభారంభం అందిస్తే హార్దిక్‌పాండ్యా, తిలక్‌వర్మ మెరుపులతో స్టేడియం హోరెత్తిపోయింది. టీ20ల్లో రెండో వేగవంతమైన పాండ్యా అర్ధసెంచరీకి తోడు వర్మ దూకుడుతో భారత్ భారీ స్కోరు అందుకుంది. లక్ష్యఛేదనలో వరుణ్, బుమ్రా రాణించడంతో దక్షిణాఫ్రికా ఓటమి వైపు నిలిచింది. తద్వారా టీ20ల్లో వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్ ఖాతాలో వేసుకుంది.
Team India | అహ్మదాబాద్: దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ (Team India) 3-1తో కైవసం చేసుకుంది. స్వదేశంలో జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీకి (T20 World Cup) సన్నాహకంగా భావించిన సిరీస్‌లో టీమ్ఇండియా సత్తాచాటింది. శుక్రవారం జరిగిన ఐదో టీ20 పోరులో భారత్ 30 పరుగుల తేడాతో సఫారీలపై (South Africa) ఘన విజయం సాధించింది. తొలుత తిలక్‌వర్మ(42 బంతుల్లో 73, 10 ఫోర్లు, సిక్స్), హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63, 5ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 231/5 స్కోరు చేసింది. ఓపెనర్లు అభిషేక్‌శర్మ(34), సంజూ శాంసన్(37) రాణించారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 201/8 స్కోరుకు పరిమితమైంది. డికాక్(35 బంతుల్లో 65, 9ఫోర్లు, 3సిక్స్‌లు) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది. వరుణ్ ్త(4/53), బుమ్రా (2/17) రాణించారు. హార్దిక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, వరుణ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి.
పాండ్యా, వర్మ ఫటాఫట్ : సఫారీలతో ఆఖరిదైన ఐదో టీ20 పోరులో టీమ్ఇండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. శాంసన్, అభిషేక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను దూకుడుగా మొదలుపెట్టాడు. ఈ ఇద్దరి జోరు యాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే మొదలైంది. యాన్సెన్‌ను ఉతికిఆరేస్తూ అభిషేక్ హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగగా, తానేం తక్కువ కాదనట్లు శాంసన్ సిక్స్ కొట్టడంతో 19 పరుగులు వచ్చాయి. వీరిద్దరు పోటీపడి మరీ బౌండరీలు బాదడంతో స్కోరుబోర్డు ఊపందుకుంది. ఇన్నింగ్స్ మరింత జోరందుకుంటున్న తరుణంలో బాచ్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌తో అభిషేక్ ఔట్ కావడంతో తొలి వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడగా, పవర్‌ప్లే ముగిసే సరికి టీమ్ఇండియా 67/1 స్కోరు చేసింది. మంచి ఫామ్‌మీదున్న హైదరాబాదీ బ్యాటర్ తిలక్‌వర్మ మరోమారు తన విలువ చాటుకోగా, శాంసన్ అర్ధసెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు.
కెప్టెన్ సూర్యకుమార్‌యాదవ్ రాకతో స్కోరు ఒకింత మందగించగా, మరోమారు తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ 5 పరుగులకే పరిమితమయ్యాడు. సూర్యకుమార్ ఔటయ్యే సరికి భారత్ 12.1 ఓవర్లలో 3 వికెట్లకు 115 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా రాకతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న తిలక్‌కు జతకలిసిన హార్దిక్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్ కొట్టి నైజం చాటుకున్నాడు. లిండే వేసిన 14వ ఓవర్లో పాండ్యా రెండు భారీ సిక్స్‌లకు తోడు రెండు ఫోర్లు, తిలక్ సిక్స్‌తో ఏకంగా 27 పరుగులు వచ్చి పడ్డాయి. ఈ క్రమంలో 30 బంతుల్లో వర్మ అర్ధసెంచరీ మార్క్ అందుకోగా, బాచ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ 6,4 కొట్టిన పాండ్యా 16 బంతుల్లోనే 50 పరుగులకు చేరుకున్నాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన అర్ధసెంచరీగా రికార్డుల్లోకెక్కింది. ఆఖరి ఓవర్లో పాండ్యా, తిలక్ ఔటైనా 19 పరుగులతో 230 మార్క్ అందుకుంది.
డికాక్ రాణించినా : లక్ష్యఛేదనను సఫారీలు దూకుడుగా మొదలుపెట్టారు. ఓపెనర్ డికాక్, హెండ్రిక్స్(13)..భారత బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ పరుగులు కొల్లగొట్టారు. ముఖ్యంగా డికాక్ తనదైన శైలిలో హార్డ్‌హిట్టింగ్ షాట్లతో బౌండరీలు సాధించాడు. డికాక్ ధాటికి అర్ష్‌దీప్ ధారాళంగా పరుగులు సమర్పించుకోగా, సుందర్ నిలువరించలేకపోయాడు. బౌలింగ్ మార్పుగా వచ్చిన వరుణ్..హెండ్రిక్స్‌ను ఔట్ చేయడంతో 69 పరుగుల తొలి వికెట్‌కు బ్రేక్ పడింది. బ్రెవిస్(31) ఇలా వచ్చి అలా వెళ్లగా, మిల్లర్(18) స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయాడు. 120/1 స్కోరుతో మెరుగ్గా కనిపించిన సఫారీలు వరుణ్, బుమ్రా ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు.
భారత్: 20 ఓవర్లలో 231/5(తిలక్ 73, హార్దిక్ 63, బాచ్ 2/44, బార్ట్‌మన్ 1/39),
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 201/8(డికాక్ 65, బ్రెవిస్ 31, వరుణ్ 4/53, బుమ్రా 2/17)