PN Link Project | హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పోలవరం-నల్లమలసాగర్ (పీఎన్) లింకు ప్రాజెక్టుపై (PN Link Project) ఏపీ సర్కారు (AP Govt) దూకుడు పెంచింది. అనుమతులకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా కేంద్రంతో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ సర్కారు చోద్యం చూస్తున్నది. లేఖలు రాసి, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి చేతులు దులుపుకుంటున్నది. అనుమతులు తీసుకోకుండానే గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. రూ.81 వేల కోట్లతో తొలుత పీబీ లింక్ ప్రాజెక్టును ముందుకు తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్టు ప్రీ-ఫీజబిలిటీ రిపోర్టు ను కేంద్రానికి సమర్పించింది. ఏపీ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రాజెక్టుకు నిధులను సమకూర్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. మరోవైపు లింక్ ప్రాజెక్టుపై అన్ని కేంద్ర సంస్థలు, కో-బేసిన్ రాష్ర్టాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినప్పటికీ డీపీఆర్ సిద్ధం చేసేందుకు ఏపీ సిద్ధమైంది. టెండర్లను కూడా ఆహ్వానించి చివరి నిమిషంలో రద్దు చేసుకున్నది. ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాజెక్టులో స్వల్ప మార్పులు చేసింది. బనకచర్ల స్థానంలో నల్లమలసాగర్‌ను తెరపైకి తీసుకొచ్చి మొత్తంగా రూ.59 వేల కోట్లతో పీఎన్ లింక్ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి టెండర్లను ఆహ్వానించింది. ఇప్పటికే ఆ ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది.
కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రితో చంద్రబాబు భేటీ
పీఎన్ లింకు ప్రాజెక్టు అనుమతుల సాధనకు ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. ఏపీ ప్రాజెక్టులకు పెండింగ్ అనుమతులు, నిధుల విడుదలపై చర్చించారు. ఆమోదం పొందిన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు కోరారు. పోలవరం జాతీయ ప్రాజెక్టులో వివిధ పనులకు పెండింగ్‌లో ఉన్న అనుమతులు వెంటనే మంజూరయ్యేలా చూడాలని కోరారు. రెండో దశ పనులకు అవసరమైన నిధులపై త్వరలోనే పూర్తి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. వంశధార నదీ వివాద ట్రిబ్యునల్ అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలివ్వాలని, ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపును చేపట్టకుండా కర్ణాటకను నిలువరించాలని కేంద్రాన్ని కోరారు. పీఎన్ లింకు ప్రాజెక్టుల అనుమతులపై కూడా చర్చించారు.
చోద్యం చూస్తున్న రేవంత్ సర్కారు
కేంద్రం నుంచి అనుమతుల సాధనకు ఏపీ సర్కారు వడివడిగా అడుగులు వేస్తుంటే తెలంగాణ సర్కారు మాత్రం చోద్యం చూస్తున్నది. లేఖలు రాసి చేతులు దులుపుకోవడం తప్ప చేస్తున్నదేమీ లేదని నీటిరంగ నిపుణులు నిప్పులు చెరుగుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చినప్పుడే సరైన రీతిలో అడ్డుకోకుండా చర్చల పేరిట అత్యుత్సాహం చూపిందని ధ్వజమెత్తుతున్నారు. తాజాగా పీఎన్ లింకుపై రేవంత్‌రెడ్డి సర్కారు అదే తరహా ఉదాసీనతను ప్రదర్శిస్తున్నది. తెలంగాణకు తీవ్ర నష్టదాయకమైన ప్రాజెక్టును ఏపీ చేపడుతున్నదని ప్రతిపక్ష బీఆర్ఎస్ గగ్గోలు పెడుతున్నా అదే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నది. తెలంగాణ నీటిహక్కుల కోసం మాజీ సీఎం కేసీఆర్ త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేయనుండటంతో రేవంత్ సర్కారు ఎట్టకేలకు కంటితుడుపు చర్యగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతే తప్ప రాష్ట్ర నీటిహక్కుల సంరక్షణకు చిత్తశుద్ధితో పోరాడుతున్న దాఖలాలు ఏ కోశానా కనిపించడం లేదు.