హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు భారీ రహదారుల నిర్మాణం కోసమంటూ పచ్చని పొలాలను చెరబడుతున్నది. నగరం నలువైపులా రేడియల్ రింగురోడ్లు, గ్రీన్ఫీల్డ్ హైవేలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నది. కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే లక్ష్యంగా రోడ్ల నిర్మాణం పేరిట వ్యవసాయ భూములను లాక్కొనేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై రైతులు కన్నెర్ర చేస్తున్నారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టిన రావిర్యాల, కోకాపేట్ గ్రీన్ఫీల్డ్ హైవేలతో వ్యవసాయరంగానికి ఒరిగే ప్రయోజనాలేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్న రోడ్లను విస్తరించడం మరిచి, కొత్తగా వందల ఫీట్ల వెడల్పుతో నిర్మించే రహదారుల వల్ల పంట పొలాలు నాశనమవుతాయని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే వ్యవసాయ భూములను లక్ష్యంగా చేసుకొని ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తున్నది.
హెచ్ఎండీఏ పరిధిలో కోర్ సిటీ నుంచి ఔటర్ రింగురోడ్డు ఎగ్జిట్లను కలుపుతూ రేడియల్ రోడ్లను నిర్మించాలన్న ప్రతిపాదనలను పక్కన పెట్టిన రేవంత్ సర్కారు.. ఔటర్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగురోడ్ల వరకు గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదనలను తెరమీదికి తెచ్చింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ రెండు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లను ప్రతిపాదించింది. ఇందులో ఒకటి ఔటర్ రింగురోడ్డు ఎగ్జిట్ నంబర్ 13 నుంచి ఊహానగరి మీదుగా ట్రిపులార్ వరకు 50 కిలోమీటర్ల మేర నిర్మించాలని, రెండోది కోకాపేట్ నియోపొలిస్ నుంచి వికారాబాద్ జిల్లాలోని పలు గ్రామాల మీదుగా పరిగి మండలం వరకు మరో 52 కిలోమీటర్ల మేర నిర్మించాలని పేర్కొంది. కాగా ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో వివాదాలు మొదలయ్యాయి. ఇటీవల రావిర్యాలకు చెందిన 40 మంది రైతులు హైకోర్టుకు వెళ్లడంతో గ్రీన్ఫీల్డ్ హైవేకు సంబంధించిన భూసేకరణపై న్యాయస్థానం స్టేటస్కో విధించింది. ఇక పరిగి గ్రీన్ఫీల్డ్ హైవేపై కూడా ఆరు మండలాల రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల హెచ్ఎండీఏకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన వికారాబాద్ జిల్లా రైతులు.. ఇక న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు.
రెండు ప్రాజెక్టులకూ వ్యతిరేకత
ఔటర్ రింగురోడ్డు నుంచి రీజినల్ రింగురోడ్డు మధ్య నిర్మించతలపెట్టిన గ్రీన్ఫీల్డ్ హైవేలపై పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. నగరం నలువైపులా మరో 10 రేడియల్ రోడ్లు రానుండగా.. ఇప్పటికే రేడియల్ రోడ్ – 1 (రావిర్యాల – ట్రిపులార్), రేడియల్ రోడ్డు – 2 (ఔటర్ నుంచి పరిగి మండలం చిట్యాల్ వరకు) నిర్మించేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. దాదాపు 300 ఫీట్లు వెడల్పుతో నిర్మించనున్న ఈ రెండు ప్రాజెక్టులతో వ్యవసాయ భూములు కనుమరుగు కానున్నాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూములన్నీ కూడా సాధారణ రైతులకు చెందినవే కావడం ఇక్కడ అనుమానాలకు దారితీస్తున్నది.
అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం..
రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాలను స్వీకరించి ప్రభుత్వానికి అందజేస్తున్నామని హెచ్ఎండీఏ యంత్రాంగం తెలిపింది. గ్రీన్ఫీల్డ్ హైవే – 1 (రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ) విషయంలో కేవలం 40 మందికి చెందిన భూసేకరణపై మాత్రమే హైకోర్టు స్టే విధించిందని, ప్రాజెక్టుపై కాదని పేర్కొంది. అయితే రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిష్కరిస్తే, వారు కోర్టులను ఎందుకు ఆశ్రయిస్తారనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ లోపాభూయిష్ట విధానాలను సూచిస్తున్నదని పలువురు రైతులు, న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సాగు భూములపై రేవంత్ కన్ను
రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, విలువైన, సారవంతమైన వ్యవసాయ భూములను కాంగ్రెస్ సర్కారు బలి చేస్తున్నదని పరిగి రైతులు మండిపడుతున్నారు. ఆ రోడ్డుతో తమ ప్రాంతానికి వచ్చే ప్రయోజనం ఏమిటో రేవంత్ సర్కారు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం కంపెనీలకు చెందిన భూములకు డిమాండ్ తీసుకురావడానికే గ్రీన్ఫీల్డ్ హైవేల నిర్మాణం పేరిట రైతులను రోడ్డున పడేస్తున్నారని రైతు నర్సిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న 30 ఫీట్ల రోడ్డుకు గత రెండేండ్లలో తట్టెడు మట్టి పోసి గుంతలు పూడ్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదల భూములను లాక్కొని నిర్మించే గ్రీన్ఫీల్డ్ హైవే ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ నుంచి తమ గ్రామాలను తొలగించాలని, సాగు భూ ములను భారీ రహదారులుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.