అహ్మదాబాద్: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఆసియాకప్ చిరస్మరణీయ విజయం మరిచిపోకముందే భారత్..స్వదేశంలో టెస్టు పోరాటం మొదలుపెట్టింది. ఆసియాకప్ గెలిచిన మూడు రోజుల వ్యవధిలోనే వెస్టిండీస్‌తో తొలి టెస్టుకు సిద్ధమైంది. దసరా రోజున(గురువారం) మొదలైన తొలి టెస్టుపై టీమ్ఇండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. విండీస్ పసలేని బౌలింగ్‌ను ఉతికి ఆరేస్తూ భారత బ్యాటర్లు ధృవ్ జురెల్(210 బంతుల్లో 125, 15ఫోర్లు, 3సిక్స్‌లు), జడేజా(176 బంతుల్లో 104 నాటౌట్, 6ఫోర్లు, 5సిక్స్‌లు), కేఎల్ రాహుల్(197 బంతుల్లో 100, 12ఫోర్లు) సెంచరీల విజృంభణతో తొలి ఇన్నింగ్స్‌లో 448/5 భారీ స్కోరు చేసింది. జడేజాతో పాటు సుందర్(9) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.
రోస్టన్ చేస్ (2/90) రెండు వికెట్లు తీయగా, సీల్స్ (1/53), వారికన్(1/102), క్యారీ పియరీ (1/91) ఒక్కో వికెట్ పడగొట్టారు. చేతిలో ఐదు వికెట్లు ఉన్న టీమ్ఇండియా ప్రస్తుతం 286 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. శనివారం తొలి సెషన్లో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశమున్న టీమ్ఇండియా ఇన్నింగ్స్ విజయంపై కన్నేసింది. అంతకుముందు గురువారం మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు కుప్పకూలింది. సిరాజ్(4/40), బుమ్రా (3/42) విజృంభణతో విండీస్ బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ సిరాజ్, బుమ్రా చెలరేగడంతో విండీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. జస్టిన్ గ్రీవ్స్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అహ్మదాబాద్ టెస్టులో టీమ్ఇండియా బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. విండీస్ బ్యాటర్లు ఘోరంగా విఫలమైన చోట..మనోళ్లు దుమ్మురేపుతున్నారు. ఓపెనర్ రాహుల్ సెంచరీతో శుభారంభం అందించగా, మిడిలార్డర్లో జురెల్, జడేజా అదే జోరు కొనసాగించారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(36), రాహుల్ మెరుగైన శుభారంభం అందజేశారు. తన సహజశైలిలో జైస్వాల్ దూకుడుగా ఆడగా, రాహుల్ పరిణతి కనబరిచాడు. జెడెన్ సీల్స్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌తో జైస్వాల్ ఔట్ కాగా, సాయి సుదర్శన్(7) మరోమారు వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. ఈ క్రమంలో మంచి ఫామ్‌మీదున్న రాహుల్..బ్యాట్‌కు పనిచెప్పాడు.
కెప్టెన్ శుభ్‌మన్‌గిల్(50)తోడుగా రాహుల్ రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సరికి 121/2 స్కోరు చేసింది. శుక్రవారం కూడా భారత బ్యాటర్లు ఇదే జోరు కనబరిచారు. అప్పటికే పిచ్‌పై పూర్తి అవగాహనకు వచ్చిన రాహుల్..విండీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు. మైదానం నలువైపులా క్లాసికల్ షాట్లతో అలరిస్తూ కెరీర్లో 11వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 2016 డిసెంబర్ తర్వాత స్వదేశంలో తొలి సెంచరీ అందుకున్నాడు. సెంచరీ చేరుకున్న తర్వాత తన కూతురును అనునయిస్తూ రాహుల్..ప్రేక్షకులకు అభివాదం చేశాడు. 218/3తో లంచ్‌కు బ్రేక్‌కు వెళ్లి వచ్చిన రాహుల్..వారికన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఆ తర్వాత జురెల్, జడేజా జత కలువడంతో మ్యాచ్ స్వరూపామే మారిపోయింది. ఈ ఇద్దరు విండీస్ బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా పరుగులు కొల్లగొట్టారు. రెగ్యులర్ కీపర్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన జురెల్ సత్తాచాటాడు. అంతగా ప్రభావం చూపని బౌలింగ్‌కు తోడు విండీస్ పేలవ ఫీల్డింగ్‌ను తమకు అనుకూలంగా మలుచుకుంటూ వీరిద్దరు పరుగుల వరద పారించారు. ధాటిగా ఆడిన జురెల్ 190 బంతుల్లో టెస్టుల్లో తొలి సెంచరీ ఖాతాలో వేసుకోగా, జడేజా సొంత ఇలాఖాలో దుమ్మురేపాడు. దూకుడుగా ఆడే క్రమంలో పియెర్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో ఐదో వికెట్‌కు 206 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. వారికన్ బౌలింగ్‌లో సింగిల్‌తో టెస్టుల్లో జడేజా ఆరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 162 ఆలౌట్(గ్రీవ్స్ 32, చేస్ 24, సిరాజ్ 4/40, బుమ్రా 3/42), భారత్ తొలి ఇన్నింగ్స్: 448/5(జురెల్ 125, జడేజా 104 నాటౌట్, రాహుల్ 100, చేస్ 2/90, సీల్స్ 1/53)