టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇరు కుటుంబాలు, వారి కొద్దిమంది బంధువులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వీరి నిశ్చితార్థం శుక్రవారం హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగింది. ఈ విషయాన్ని వారి సన్నిహితులు స్వయంగా ప్రకటించారు. విజయ్, రష్మికల వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్నదని సమాచారం. వీరు తొలిసారి జంటగా నటించిన సినిమా ‘గీత గోవిందం’. ఆ సినిమాలో వీరిద్దరి జంట ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నది.
తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ కూడా అద్భుతంగా వర్కవుట్ అయింది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ సినిమాలోనూ వీరిద్దరూ ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో వీరిద్దరూ నటించిన కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. మళ్లీ ఈ జంట కలిసి నటించే సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి వీరిద్దరూ రిలేషన్లో ఉన్నట్టు చాలారోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
వాటికి బలాన్నిస్తూ పలు వెకేషన్స్‌లో ఈ జంట సందడి చేసిన ఫొటోలు కూడా మీడియాలో దర్శనమిచ్చాయి. వీరిపై వస్తున్న వార్తలను ఏనాడూ వీరు ఖండించకపోవడం గమనార్హం. శుక్రవారం జరిగిన వీరి నిశ్చితార్థంతో ఆ వార్తలన్నీ నిజమే అని తేలిపోయింది. ఏది ఏమైనా తెరపై అభిమాన జంట.. నిజజీవితంలోనూ ఒకటవ్వడం అభిమానులు నిజంగా ఆనందించే విషయమే.