అగ్ర కథానాయకుడు బాలకృష్ణ నటిస్తున్న డివోషనల్ యాక్షన్ ఎంటైర్టెనర్ ‘అఖండ 2’. బ్లాక్ బాస్టర్ ‘అఖండ’కు ఇది సీక్వెల్. బోయపాటి శ్రీను దర్శకుడు. రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట నిర్మాతలు. డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేశారు.
ఈ సీక్వెల్ ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించబోతున్నదని మేకర్స్ తెలిపారు. లాంగ్ హెయిర్, రగ్గడ్ బీర్డ్, రుద్రాక్షాభరణాలు, చేతిలో త్రిశూలం, గోధుమరంగు, కాషాయంతో కూడిన సంప్రదాయ దుస్తులు.. వీటన్నింటితో శక్తివంతుడైన అఘోరీగా ఈ పోస్టర్లో బాలకృష్ణ కనిపిస్తున్నారు. ఓ డివైన్ వైబ్‌ను జోడించేలా ఆయన లుక్ ఉంది. ప్రకాశవంతమైన మంచు పర్వతాల నేపథ్యం ఈ పోస్టర్‌కు స్పెషల్ అట్రాక్షన్. ఆది పినిశెట్టి, సంయుక్తమీనన్, హర్షాలి మల్హోత్రా ఇందులో కీలక పాత్రధారులు.
తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.తేజస్వినీ నందమూరి సమర్పిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. ఈ దసరా సందర్భంలోనే మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తాను నటించబోతున్న సినిమాకు సంబంధించిన ప్రారంభ ముహూర్తాన్ని కూడా ప్రకటించేశారు బాలకృష్ణ. ఈ నెల 24న ఈ సినిమా ఓపెనింగ్ గ్రాండ్‌గా జరుగనున్నది. హిస్టారికల్ ఎపిక్ జానర్లో రూపొందనున్న ఈ సినిమాలో ఇంతకు ముందు చూడని కొత్త అవతారంలో బాలకృష్ణను చూపించనున్నామని మలినేని గోపీచంద్ తెలిపారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.