IND vs PAK : ఐక్యరాజ్యసమితి (UNO) లో పాకిస్థాన్ (Pakistan) వైఖరిని భారత్ (India) మరోసారి ఎండగట్టింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindhoor) పై ఆ దేశ రాయబారి చేసిన తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టింది. ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేసేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోందని మండిపడింది. ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ (Parvathaneni Harish) ఘాటుగా స్పందించారు.
సోమవారం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో పాక్ రాయబారి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్, జమ్ముకశ్మీర్, సింధూ జలాల ఒప్పందం గురించి ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని శిక్షిస్తూ సరికొత్త సాధారణ స్థితి నెలకొల్పినట్లు భారత్ చెబుతున్న పరిస్థితి ఏమీ కనిపించడం లేదని పేర్కొన్నారు. ఈ విషయం ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తమ ప్రతిస్పందనతోనే తేలిపోయిందని వ్యాఖ్యానించారు.
దీనిపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ఘాటుగా స్పందించారు. అంతర్జాతీయ వేదికల్లో పాకిస్థాన్ ప్రతిసారీ భారత్‌కు, దేశ ప్రజలకు హాని కలిగించడమే అజెండాగా పెట్టుకుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని హరీశ్ పునరుద్ఘాటించారు.
భారత అంతర్గత అంశాలపై వ్యాఖ్యానించే హక్కు పాకిస్థాన్‌కు లేదన్నారు. 65 ఏళ్ల క్రితం విశ్వాసం, స్నేహం స్ఫూర్తితో భారత్ సింధూ జలాల ఒప్పందం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అన్నారు. అందుకే భారత్ ఆ ఒప్పందాన్ని నిలిపివేసిందని తెలిపారు.