Snowfall : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో భారీగా మంచు (Snow) కురుస్తున్నది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం (Srinagar International Airport) నుంచి రాకపోకలు సాగించే 50 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఒక ప్రకటన విడుదల చేసింది.
శ్రీనగర్ విమానాశ్రయంలో వాతావరణం ప్రతికూలంగా ఉందని, మంచు ఎడతెరపి లేకుండా కురుస్తున్నదని ఏఏఐ పేర్కొన్నది. ఈ కారణంగా శ్రీనగర్‌కు రావాల్సిన 25 విమాన సర్వీసులను, శ్రీనగర్ నుంచి వెళ్లాల్సిన మరో 25 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. ఈ రద్దు నేపథ్యంలో ప్రత్యామ్నాయ విమానాల కోసం ప్రయాణికులు విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించింది.
కాగా విమానాల రద్దు కారణంగా వారాంతపు సెలవులను ఎంజాయ్ చేసేందుకు జమ్ముకశ్మీర్‌కు వెళ్లిన చాలా మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు.