Blood Circulation | మన శరీర అవయవాలకు నిరంతరం రక్తప్రసరణ జరుగుతూనే ఉంటుంది. రక్తప్రసరణ సరిగ్గా జరిగినప్పుడే శరీరంలో అవయవాలు సక్రమంగా విధులను నిర్వర్తించగలవు. అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తప్రసరణ బలహీనపడినప్పుడు శరీరం స్పష్టమైన సంకేతాలను కనబరుస్తుంది. రక్తప్రసరణ బలహీనపడినప్పుడు ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న రక్తం శరీర భాగాలను చేరుకోవడానికి ఇబ్బంది పడుతుంది. దీని వల్ల శరీరం పలు లక్షణాలను కనబరుస్తుంది. ఈ లక్షణాలను ముందుగా గుర్తించడం చాలా అవసరం. అలాగే ఈ లక్షణాలను నిర్లక్ష్యం కూడా చేయకూడదు. ఇవి ఎక్కువ కాలం పాటు కనబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స కూడా తీసుకోవాలి. రక్తప్రసరణ బలహీనపడినప్పుడు శరీరం కనబరిచే కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ధమనులు ఇరుకుగా మారినప్పుడు అవయవాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీంతో చేతులు, కాళ్లు, వేళ్లు నిరంతరం జలదరిస్తాయి. సూదులు, పిన్నులతో గుచ్చినట్టుగా ఉంటుంది. ఇది నరాలకు రక్తప్రసరణ సరిగ్గా జరగడం లేదని అర్థం. సాధారణంగా మనం కాళ్లను, చేతులను చాలా సమయం వరకు కదలించకుండా అలాగే ఉంచినప్పుడు తిమ్మిర్లు వచ్చి వెంటనే తగ్గిపోతూ ఉంటాయి. కానీ రక్తప్రసరణ సరిగ్గా జరగనప్పుడు వచ్చే తిమ్మిర్లు ఎక్కవ సమయం ఉండడంతో పాటు ఎక్కువ కాలం పాటు ఉంటాయి. రక్తప్రసరణ జరగనప్పుడు శరీరంలో దూర భాగాలకు రక్తం సరిగ్గా సరఫరా అవ్వదు. దీంతో కాలి వేళ్లు, చేతుల వేళ్లు, చేతులు తగినంత వెచ్చదనం ఉత్పత్తి అవ్వక ఎల్లప్పుడూ చల్లగా ఉంటాయి. ఇరుకైన ధమనులు తక్కువ వెచ్చని రక్తాన్ని సరఫరా చేయడం వల్ల ఇలా జరుగుతుంది. రక్తసరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. దీంతో చేతివేళ్లు, గోర్లు, చర్మం నీలం లేదా ఊదారంగులో కనిపిస్తాయి. దీనిని వైద్య పరిభాషలో సైనోసిస్ అని పిలుస్తారు. గోర్లు, చర్మం నీలి రంగులో మారడాన్ని సాధారణంగా పరిగణించకూడదు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సహాయం తీసుకోవడం అవసరం.
నడిచేటప్పుడు కాళ్ల కండరాలు నొప్పిగా ఉంటాయి. విశ్రాంతి తీసుకున్న తరువాత మరలా సాధారణ స్థితికి వస్తాయి. దీనిని క్లాడికేషన్ అని పిలుస్తారు. చాలా మంది వయసు పైబడడం వల్ల ఇలా జరుగుతుందని భావిస్తారు. కానీ అన్ని సందర్భాల్లో వయసు పైబడడం వల్ల ఇలా జరుగుతుందని భావించకూడదు. ఇరుకైన రక్తనాళాలు కాళ్ల కండరాలకు ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తాయి. దీంతో కాళ్ల కండరాల్లో నొప్పి వస్తుంది. రక్తసరఫరా సరిగ్గా జరగకపోవడం వల్ల కాళ్ల గోర్లు పెలుసుగా తయారవుతాయి. నిదానంగా పెరుగుతాయి. అలాగే కాళ్లపై వెంట్రుకలు రాలిపోతాయి. గోర్లకు, వెంట్రుకలకు రక్తసరఫరా నిరంతరం జరగడం చాలా అవసరం. ఆక్సిజన్, పోషకాలు సరిగ్గా అందక పోవడం వల్ల గోర్లు, జుట్టు బలహీనపడడం వల్ల ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు ఈ లక్షణాలు తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తాయి. ఇలాంటి లక్షణాలను వారం రోజుల కంటే ఎక్కువ కాలం పాటు గుర్తించినట్టయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం.