Israel : భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పశ్చిమాసియా (West Asia) ప్రాంతంలో శాంతి భద్రతలను నెలకొల్పడానికి భారత్ అత్యంత కీలకమైన పాత్ర పోషించాల్సి ఉందని ఇజ్రాయెల్ రాయబారి (Israel Ambssador) రూవెన్ అజర్ (Ruven Azar) అభిప్రాయపడ్డారు. వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా, బలమైన వాణిజ్య భాగస్వామిగా భారత్ ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచంలోని అన్ని ప్రధాన వాణిజ్య కూటములతో భారత్ చారిత్రాత్మక ఒప్పందాలను కుదుర్చుకుందని రూవెన్ అజర్ గుర్తుచేశారు.
పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పి, తీవ్రవాద శక్తులను అణచివేయగలిగితే.. భారత్ ద్వారా వచ్చే ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు, వస్తు రవాణావల్ల ఇక్కడి దేశాలన్నీ అద్భుతమైన సంపదను, శ్రేయస్సును అనుభవిస్తాయని రూవెన్ అజర్ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ ప్రాంత స్థిరత్వంలో ఢిల్లీ పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన దౌత్య బంధాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్‌పై విమర్శలు వస్తున్నప్పటికీ.. భారత్ నుంచి మాత్రం తమకు అచంచలమైన ప్రజా మద్దతు లభిస్తోందని చెప్పారు. భారత్‌లో ఇజ్రాయెల్ పట్ల ఒక అద్భుతమైన క్రేజీ లవ్ ఉందని, ప్రపంచంలో మరే దేశం నుంచి లేనంత మంది ఫాలోవర్లు నాకు ఒక్క భారతదేశం నుంచే ఉన్నారని నెతన్యాహు సంతోషం వ్యక్తంచేశారు.