ఏడాదిన్నర క్రితం కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులకు అంతులేని ఆవేదనను మిగిల్చిన కంగారూలపై రోహిత్ సేన కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పరాభవాలకు బదులు తీర్చుకుంటూ ఆసీస్‌ను సెమీస్‌లో మట్టికరిపించింది. బౌలింగ్‌లో స్మిత్ సేనను మోస్తరు స్కోరుకే కట్టడిచేసిన టీమ్ఇండియా.. ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లీ, ఐసీసీ టోర్నీలలో నిలకడగా ఆడే శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మెరవడంతో చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. కోహ్లీ మరోసారి కళాత్మక ఇన్నింగ్స్‌తో కంగారూలను కంగారెత్తించాడు. తక్కువ స్కోరును కాపాడుకునేందుకు ఆసీస్ కడదాకా పోరాడినా ఆ జట్టుకు పరాభవం తప్పలేదు.
దుబాయ్: బదులు తీరింది! గత రెండు ఐసీసీ టోర్నీలలో భారత కప్పు ఆశలపై నీళ్లు చల్లిన వరల్డ్ చాంపియన్స్ ఆస్ట్రేలియాపై భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీస్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో నెగ్గి ఫైనల్‌కు చేరుకుంది. కంగారూలు నిర్దేశించిన 265 పరుగుల ఛేదనను రోహిత్ సేన 48.1 ఓవర్లలో పూర్తిచేసి ఈ టోర్నీలో వరుసగా మూడోసారి ఫైనల్ చేరింది. ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లీ (98 బంతుల్లో 84, 5 ఫోర్లు) మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో మెరవగా శ్రేయాస్ అయ్యర్ (62 బంతుల్లో 45, 3 ఫోర్లు), కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 42 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ తరఫున సారథి స్టీవ్ స్మిత్ (96 బంతుల్లో 73, 4 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ కేరీ (57 బంతుల్లో 61, 8 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకోవడంతో ఆ జట్టు పోరాడగలిగే స్కోరును సాధించింది. భారత బౌలర్లలో షమీ (3/48), జడేజా (2/40), వరుణ్ (2/49), అక్షర్ (1/43) ఆసీస్‌ను కట్టడి చేశారు. కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య బుధవారం జరుగబోయే రెండో సెమీస్ విజేతతో భారత్ ఈనెల 9న టైటిల్ పోరులో తలపడనుంది.
నిలబడ్డ కోహ్లీ, శ్రేయాస్
మోస్తరు ఛేదనలో రోహిత్ (28), గిల్ (8) త్వరగానే నిష్క్రమించినా కోహ్లీ, శ్రేయాస్ నిలబడ్డారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 91 పరుగులు జోడించి భారత విజయంలో కీలకపాత్ర పోషించారు. పాక్‌తో మ్యాచ్‌లో మాదిరిగానే కోహ్లీ.. మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ మ్యాచ్‌కూ భిన్నంగా స్పందిస్తున్న పిచ్‌పై కోహ్లీ, శ్రేయాస్ తమ అనుభవన్నంతా రంగరించి కంగారూలకు ఏమాత్రం అవకాశమివ్వకుండాఆడారు. రోహిత్ 7, 15 పరుగుల వద్ద కనోలి, లబూషేన్ క్యాచ్‌లు జారవిడిచినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఫామ్‌లో ఉన్న గిల్‌ను డ్వార్షుయిస్ ఐదో ఓవర్లో క్లీన్‌బౌల్డ్ చేయగా కనోలి 8వ ఓవర్లో రోహిత్ లెగ్‌బిఫోర్‌గా నిష్క్రమించాడు. ఈ క్రమంలో కోహ్లీ, శ్రేయాస్ ద్వయం వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. కనోలి 10వ ఓవర్లో రెండు బౌండరీలు బాదిన శ్రేయాస్.. జంపా, సంఘా, మ్యాక్స్‌వెల్‌ను సమర్థంగా ఎదుర్కుని పరుగులు రాబట్టాడు. మరో ఎండ్‌లో కోహ్లీ కూడా స్ట్రైక్ రొటేట్ చేస్తూ రన్ రేట్ పడిపోకుండా జాగ్రత్తపడ్డాడు. జంపా 25వ ఓవర్లో బౌండరీతో తన కెరీర్లో 74వ అర్ధ సెంచరీ పూర్తియింది. కానీ జంపా వేసిన 27వ ఓవర్లో శ్రేయాస్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అక్షర్ (27) ఓ భారీ సిక్స్, ఫోర్‌తో వేగంగా ఆడేందుకు యత్నించాడు. కానీ ఎల్లీస్ 35వ ఓవర్లో ఇన్సైడ్ ఎడ్జ్‌తో బౌల్డ్ అయ్యాడు. కోహ్లీ, అక్షర్ నాలుగో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. 39వ ఓవర్లో 200 పరుగులు మార్కును దాటి లక్ష్యం దిశగా సాగుతున్న భారత్‌ను జంపా మరోసారి దెబ్బకొట్టాడు. అతడి 43వ ఓవర్లో కోహ్లీ.. లాంగాన్ వద్ద డ్వార్షుయిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కానీ అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న రాహుల్.. హార్దిక్(28), జడేజా(2 నాటౌట్) అండతో లాంఛనాన్ని పూర్తిచేశాడు.
స్మిత్, కేరీ పోరాటం
బౌలింగ్ బలహీనంగా ఉన్నప్పటికీ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆస్ట్రేలియా.. భారత స్పిన్నర్ల ధాటికి తలొగ్గక తప్పలేదు. షమీ తన రెండో ఓవర్లోనే ఓపెనర్ కనోలిని డకౌట్ చేసి భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. టీమ్ఇండియాకు కొరకరాని కొయ్య అయిన హెడ్ (39) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. వరుణ్.. తాను వేసిన తొలి ఓవర్ (ఇన్నింగ్స్ 9వ)లో రెండో బంతికే హెడ్‌ను ఔట్ చేయడంతో మెన్ ఇన్ బ్లూ ఊపిరి పీల్చుకుంది. అయితే స్మిత్.. క్రీజులో అడ్డుగోడలా నిలబడ్డాడు. మొదట హెడ్‌తో ఆ తర్వాత లబూషేన్ (29), కేరీతో అతడు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. స్మిత్, లబూషేన్ ద్వయాన్ని విడదీయడానికి రోహిత్.. అక్షర్, జడేజా, వరుణ్‌తో నిరాటంకంగా దాడి చేయించాడు. ఎట్టకేలకు జడేజా 23వ ఓవర్లో లబూషేన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. అదే ఊపులో జడ్డూ.. ఇంగ్లిస్ (11)నూ వెనక్కిపంపాడు. కానీ స్మిత్‌కు జతకలిసిన కేరీ భారత స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగాడు. 69 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న స్మిత్.. ఐసీసీ నాకౌట్లలో తానెంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. మరో ఎండ్‌లో కేరీ.. వరుణ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదడమే గాక కుల్దీప్, హార్దిక్ ఓవర్లలో రెండేసి బౌండరీలు రాబట్టాడు. స్కోరును పెంచే క్రమంలో స్మిత్.. షమీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అవడంతో మ్యాచ్‌పై మళ్లీ భారత్ పట్టుబిగించింది. మ్యాక్స్‌వెల్ (7) ను అక్షర్ అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లలో కోహ్లీ (161).. పాంటింగ్ (160)ను అధిగమించాడు. ఈ జాబితాలో జయవర్దనె(218) తర్వాత కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.
శివాల్కర్ మృతికి సంతాపంగా..
దేశవాళీ క్రికెట్ దిగ్గజం పద్మాకర్ శివాల్కర్(84) మృతికి సంతాప సూచకంగా ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్ సందర్భంగా టీమ్ఇండియా క్రికెటర్లు నల్లని బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. వయసు సంబంధిత కారణాలతో శివాల్కర్ ఈ మధ్యే తనువు చాలించిన సంగతి తెలిసిందే. ముంబై తరఫున 124 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన లెఫ్టార్మ్ స్పిన్నర్ శివాల్కర్ 589 వికెట్లు పడగొట్టాడు.ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించిన టీమ్ఇండియాకు అభినందనలు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్. టైటిల్ పోరులో టీమ్ఇండియాకు బెస్టాఫ్ లక్. మరొక్క అడుగుతో కప్‌ను తిరిగి దేశానికి తీసుకురండి. అద్భుతమైన ఆటతీరు, సంకల్పం కనబరిచిన కోహ్లీ ఇన్నింగ్స్ చిరస్మరణీయం.
– హరీశ్‌రావు, మాజీ మంత్రి
ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నీలలో జట్టును ఫైనల్ చేర్చిన తొలి సారథి రోహిత్. అతడి సారథ్యంలో భారత్ డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్ (2023), వన్డే ప్రపంచకప్ (2023), టీ20 వరల్డ్ కప్ (2024), చాంపియన్స్ ట్రోఫీ (2025)లో ఫైనల్ చేరింది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 49.3 ఓవర్లలో 264 ఆలౌట్ (స్మిత్ 73, కేరీ 61, షమీ 3/48, జడేజా 2/40); భారత్: 48.1 ఓవర్లలో 267/6 (కోహ్లీ 84, శ్రేయాస్ 45, జంపా 2/60, కనోలి 1/37)