న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్నా.. అవమానపరిచే ప్రకటనలు చేస్తున్నా ఇంతకాలం అమెరికాకు అణగిమణిగి ఉన్న భారత్ తన వైఖరి మార్చుకున్నట్టు కన్పిస్తున్నది. ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల ఉమ్మడి ప్రకటన ద్వారా భారత్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. భారత్ ఆతిథ్యంలో జరిగిన సమావేశంలో యూఎస్ పేరు ప్రస్తావించకుండానే దాని వైఖరిని సభ్య దేశాలు తీవ్రంగా ఎండగట్టాయి.
ఈ చర్యతో ఇన్నాళ్లు మిత్ర దేశంగా పేర్కొంటున్న అమెరికా నుంచి భారత్ దూరం జరిగి నూతన దౌత్యపరమైన అవకాశాన్ని తెరచిందని దౌత్య నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ఏకపక్షంగా విధిస్తున్న ఆంక్షలను బ్రిక్స్ ఆ దేశం పేరు ప్రస్తావించకుండా ఖండించింది. అలాగే ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా లేని సుంకం, సుంకేతర చర్యలపై కూడా బ్రిక్స్ తీవ్రంగా అభ్యంతరం చెప్పింది.
ఒక పక్క భారత్ తమ మిత్రదేశమని పేర్కొంటూనే నిర్దాక్షిణ్యంగా సుంకాలు విధించడమే కాక, వ్యవసాయ రంగానికి సంబంధించి కొన్ని ఒప్పందాలు బలవంతంగా చేయించడం పట్ల భారత్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఎంతకాలం ఇలా అణగిమణిగి ఉండాలన్న ప్రశ్నలు తలెత్తాయి. దీంతో నిరసన గళం విన్పించడానికి బ్రిక్స్ సదస్సును వేదికగా మార్చుకుంది. చైనా, రష్యా లాంటి దేశాలతో కలిసి అగ్రరాజ్య వైఖరిని ఎండగట్టింది.
ముఖ్యంగా ఇరాన్, రష్యా పట్ల అమెరికా ఏకపక్షంగా పాల్పడుతున్న చర్యలను నిలదీసింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురుకు వాషింగ్టన్ అదనపు సుంకాన్ని విధించడాన్ని ‘అన్యాయమైనది, అసమంజమైనది’అని పేర్కొన్న భారత్ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు చేపడతామని గతంలోనే ప్రతిజ్ఞ చేసింది. ఇప్పుడు బ్రిక్స్ సమావేశాన్ని దానికి వేదికగా మార్చుకుంది.