హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనలో సిరుల ఖనిగా వెలుగొందిన సింగరేణి కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలకు కేంద్రంగా మారిందని మాజీ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. బుధవారం తెలంగాణభవన్‌లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్, పార్టీ సీనియర్ నేతలు బొమ్మెర రామ్మూర్తి, కే కిశోర్‌గౌడ్, కురువ విజయ్‌కుమార్, కౌశిక్ హరి, రవీందర్‌రెడ్డి, విద్యాసాగర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి కింగ్‌పిన్‌గా అక్రమాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట గనులను కొల్లగొట్టే భారీ స్కామ్‌కు తెరలేపారని మండిపడ్డారు. ఏకంగా రూ. 16 వేల కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు ను మాయం చేశారని విమర్శించారు.
సింగరేణి బొగ్గు రూ.3,800లకు టన్ను దొరుకు తుంటే కమీషన్ల కోసం టన్నుకు రూ.10 వేలకుపైగా వెచ్చించి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. జైపూర్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు, డీజిల్ వినియోగంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జైపూర్ పవర్‌ప్లాంట్‌లో కేవలం 334 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి మాత్రమే జరగడం శోచనీయమని ధ్వజమెత్తారు. సింగరేణిని ప్రైవేట్‌కు కట్టబెట్టే కుట్రలకు రాష్ట్ర సర్కార్ తెరలేపిందని బాల్క సుమన్ మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
సిరిసిల్లకు రేవంత్‌రెడ్డి టూరిస్ట్ అని, అక్కడి అభివృద్ధిని చూసేందుకే వెళ్లారని బాల్క సుమ న్ ఎద్దేవాచేశారు. కేటీఆర్ ఎమ్మెల్యే, మంత్రి అయిన తర్వాతే సిరిసిల్ల సిరుల సిల్లగా మా రిందని స్పష్టంచేశారు. నేతన్నల ఆత్మహత్యలను చూసి చలించిపోయిన కేసీఆర్ ఉద్యమ సమయంలో జోలెపట్టి రూ.50లక్షలు విరాళాలు సేకరించి అందించారని గుర్తుచేశారు.