చండీగఢ్: భారత వైమానిక దళంలో సుదీర్ఘ కాలం(62 ఏండ్లు) సేవలందించిన మిగ్-21 విమానాల శకం శుక్రవారం ముగిసింది. చంఢీగఢ్‌లో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మిగ్-21 బైసన్‌ను చివరిసారిగా నడిపారు. ప్రియా శర్మ మిగ్‌ను నడిపిన చివరి మహిళా పైలట్‌గా నిలిచారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్, సీడీఎస్ అనిల్ చౌహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాంథర్స్గా పిలిచే మిగ్-21 జెట్స్ ల్యాండింగ్ సందర్భంగా జల ఫిరంగులతో వందనం చేశారు. 1966-1980 మధ్య కాలంలో భారత్ వివిధ మోడళ్లలోని 872 మిగ్ విమానాలను కొనుగోలు చేసింది.
పాకిస్థాన్‌తో 1965, 1977, 1999లో జరిగిన యుద్ధాల్లో, 2019లో జరిగిన బాలాకోట్ గగనతల దాడుల్లో ఈ విమానాలు కీలకపాత్ర పోషించాయి. ‘ఆరు దశాబ్దాల పాటు సేవలు, లెక్కలేనన్ని సాహస గాథలు, దేశ గౌరవాన్ని ఆకాశంలో రెపరెపలాడించిన యుద్ధ గుర్రం’ అంటూ ఐఏఏఫ్ ఎక్స్‌లో మిగ్-21 సేవలను ప్రశంసించింది. అయితే ఈ విమానాల సుదీర్ఘ సేవా చరిత్ర అనేక ప్రమాదాల వల్ల దెబ్బతింది. ఈ పాత కాలం నాటి విమానాల భద్రతపై ఇటీవలి దశాబ్దాలలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.