న్యూఢిల్లీ: విశ్వం పరిణామం గురించి ప్రస్తుత అవగాహనను తోసిపుచ్చే నూతన కృష్ణబిలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆర్ఏసీఎస్ జే0320-35 అనే ప్రకాశవంతమైన, శక్తిమంతమైన ఖగోళ వస్తువు ఊహింపశక్యం కానంత దూరంలో ఉన్నట్లు గమనించారు. ఇది కృష్ణ బిలం వృద్ధికి సంబంధించిన సంప్రదాయ సిద్ధాంతాలను సవాల్ చేస్తున్నదని పేర్కొన్నారు.
ఈ ఖగోళ వస్తువు 12.8 బిలియన్ సంవత్సరాల నుంచి ప్రయాణిస్తున్నదని, దీని బరువు బిగ్ బ్యాంగ్ తర్వాత 920 మిలియన్ సంవత్సరాల్లో ఒక బిలియన్ సూర్యుళ్లతో సమానమైన బరువుకు పెరిగిందని తెలుస్తున్నది. దీని అసాధారణ వృద్ధి రేటు, ఎక్స్రేల్లో దీని ప్రకాశం శాస్త్రవేత్తలను విస్మయానికి గురి చేస్తున్నాయి.
ఆస్ట్రేలియన్ స్కేర్ కిలోమీటర్ ఎరే పాత్ఫైండర్ అత్యంత దూరంలో ఉన్న ప్రకాశవంతమైన వస్తువును గుర్తించడంతో ఆర్ఏసీఎస్ జే0320-35 అన్వేషణ కోసం ప్రయాణం మొదలైంది. దీనికి ప్రకాశవంతమైన, శక్తిమంతమైన ఖగోళ వస్తువు లక్షణాలు ఉన్నట్లు గమనించారు. వీటిలో అత్యంత బరువైన కృష్ణ బిలాలు ఉంటాయి. భారీ స్థాయిలో వాయువును ఇవి శోషించుకుంటాయి.
2023లో చంద్ర అబ్జర్వేటరీ ఎక్స్రే ద్వారా పరిశీలించినపుడు ఆర్ఏసీఎస్ జే0320-35 ప్రత్యేకత వెల్లడైంది. కృష్ణ బిలాలు వృద్ధి చెందే రేటు కన్నా 2.4 రెట్ల ఎక్కువ రేటుతో ఇది పెరుగుతున్నది. ఇది సంవత్సరానికి 300 నుంచి 3,000 సూర్యుళ్లతో సమానమైన మెటీరియల్ను ఇముడ్చుకుంటుంది.