న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో ఈ నెల 22న జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత రామచంద్రా రెడ్డి అలియాస్ రాజు దాదా మృతదేహాన్ని తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భద్రపర్చాలని, దానిని దహనం కానీ, పూడ్చిపెట్టడం కానీ చేయవద్దని సుప్రీం కోర్టు శుక్రవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తన తండ్రిని చిత్రహింసలు పెట్టిన అనంతరం బూటకపు ఎన్కౌంటర్లో పోలీసులు హతమార్చారని రామచంద్రరెడ్డి కుమారుడు రాజా చంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌లు దీపాంకర్ దత్తా, ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.
కాగా, ప్రభుత్వం తరపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ పిటిషనర్ తండ్రిపై ఏడు రాష్ర్టాలో ఏడు కోట్ల రివార్డు ఉందని తెలిపారు. ఇప్పటికే ఇరువురి మృతదేహాలకు పోస్ట్‌మార్టం జరిగిందని, దానిని వీడియో తీశారని, ఈ విషయంలో పోలీసులకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పారు. పిటిషనర్ విజ్ఞప్తిపై తగు నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం హైకోర్టును ఆదేశించింది.