న్యూఢిల్లీ: పాడి పరిశ్రమలో పాల దిగుబడిని పెంచేందుకు రష్యాకు చెందిన ‘నీరీ’ అనే సాంకేతిక సంస్థ ప్రపంచంలోనే మొదటిసారిగా ఆవు మెదడులో న్యూరో ఇంప్లాంట్లను అమర్చింది. పాల ఉత్పత్తి పెంచేందుకు ఉన్న ఇతర పద్ధతులు ఫలించనప్పుడు, ఇలాంటి విప్లవాత్మక పరిష్కారం దిశగా అడుగులు వేయడం సంచలనం సృష్టిస్తోంది. ‘నీరీ’ గత నెలలో ఐదు ఆవులకు శస్త్రచికిత్సలు నిర్వహించి వాటి మెదడులో ఈ ప్రత్యేక పరికరాలను అమర్చింది. ఆవుల తల వెనుక ఒక స్టిమ్యులేటర్ను, మెదడు లోపలికి చొచ్చుకుపోయేలా కొన్ని ఎలక్ట్రోడ్లను అమర్చారు.
ఆకలి, ఒత్తిడి, పునరుత్పత్తి వంటి వాటికి కారణమయ్యే మెదడులోని భాగాలను ఈ పరికరాల ద్వారా విద్యుత్తు ప్రేరణలతో ఉద్దీపన చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, ఈ ఆవులకు శస్త్రచికిత్స జరిగే సమయంలో స్పృహ ఉండటం గమనార్హం. అయినా అవి ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేకుండానే మళ్లీ పాల ఉత్పత్తి ప్రక్రియలోకి వచ్చేశాయి. అధికారిక డాటా ఇంకా విడుదల కానప్పటికీ, ఈ ఇంప్లాంట్ల వల్ల ఆవుల పాల దిగుబడి మెరుగుపడిందని ‘నీరీ’ పేర్కొంది. ఈ న్యూరో ఇంప్లాంట్ మెదడు ఉద్దీపన వంటి పూర్తిగా కొత్త విధానాలు, పాడి పరిశ్రమలో గణనీయమైన మార్పు తీసుకొస్తాయని భావిస్తున్నారు.