లెహ్: లద్దాఖ్‌కి రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ చేపట్టిన శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారి నలుగురు మరణించగా, మరో 70 మందికి పైగా గాయపడిన నేపథ్యంలో నిరసనకారులను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై వాతావరణ పరిరక్షణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ని శుక్రవారం జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద అరెస్టు చేశారు. వాంగ్‌చుక్‌ని జైలుకు తీసుకెళ్తారా లేక మరో చోటుకా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. బుధవారం లెహ్‌లో ఘర్షణలు జరిగిన తర్వాత పరిస్థితిని అదుపు చేయడానికి కర్ఫ్యూ విధించారు. లద్దాఖ్‌కి రాష్ట్ర హోదా కల్పించాలని, లద్దాఖ్‌ని రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండు చేస్తూ రెండు వారాల నిరాహార దీక్ష చేపట్టిన వాంగ్‌చుక్ నిరసన హింసాత్మకంగా మారడంతో తన దీక్షను అదేరోజు విరమించారు.
లెహ్‌లో తలెత్తిన హింసాకాండకు వాంగ్‌చుక్ బాధ్యుడని మరుసటి రోజు ప్రభుత్వం నిందించింది. వాంగ్‌చుక్ రెచ్చగొట్టే ప్రకటనలు, అధికారులు, లద్దాఖీ ప్రతినిధుల మధ్య ప్రస్తుతం జరుగుతున్న చర్చలపై కొన్ని రాజకీయ స్వార్థశక్తుల అసంతృప్తి నిరసనకారులను హింసకు ప్రేరేపించాయని ప్రభుత్వం పేర్కొంది. అరబ్ తిరుగుబాటు, నేపాల్ జెన్-జీని ప్రస్తావిస్తూ వాంగ్‌చుక్ చేసిన వ్యాఖ్యలతో నిరసనకారులు పట్టలేని ఆవేశంతో లెహ్‌లోని బీజేపీ కార్యాలయాన్ని దగ్ధం చేయడంతోపాటు ప్రభుత్వ వాహనాలకు నిప్పుపెట్టారని హోం శాఖ ఆరోపించింది.
సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టును ప్రతిపక్షాలు శుక్రవారం తీవ్రంగా ఖండించాయి. నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు పోతోందని, క్రూరమైన చట్టాలను ఉపయోగించడం ద్వారా కక్షసాధింపు అజెండాను పాటిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దేశంలో నియంతృత్వం పరాకాష్ఠకు చేరిందని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ విమర్శించారు. రాష్ట్ర హోదా కోసం లద్దాఖ్ ప్రజలు సాగిస్తున్న పోరాటానికి తాము అండగా ఉంటామని ఆయన ప్రకటించారు. వాంగ్‌చుక్ అరెస్టు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసిన జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా లద్దాఖ్‌కి ఇచ్చిన హామీల విషయంలో కేంద్రం ఎందుకు వెనక్కు తగ్గిందని ప్రశ్నించారు. వాంగ్‌చుక్‌ని అరెస్టు చేయడం ద్వారా అసమ్మతిని జాతి వ్యతిరేకంగా పరిగణిస్తామని ప్రభుత్వం నిరూపించుకుందని టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ తెలిపారు.