హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ క్రమంగా గాడిన పడుతున్నది. చాలా రూట్లలో ఆక్యుపెన్సీ రేషియో(ఏఆర్)పెరుగుతున్నది. సంస్థ మనుగడకు ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత హృదయంతో అందిస్తున్న సహకారం, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తీసుకొంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో ఫలితాన్నిస్తున్నాయి. ఆర్టీసీ రోజు వారీ ప్రయాణికుల సంఖ్య సరాసరి 70 శాతానికి చేరుకోవటమే ఇందుకు నిదర్శనం. పెరుగుతున్న పెట్రో ధరల కారణంగా చాలా మంది సొంతవాహనాలు వదిలి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ప్రతి రోజు 62-80 శాతం ఓఆర్ నమోదవుతున్నది. ఏప్రిల్లో 27వ తేదీ వరకు గణాంకాలు చూస్తే రోజుకు సగటున రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోజుకు 32.40 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఏప్రిల్లో రోజుకు 29.28 లక్షల మంది ప్రయాణికులను ఆర్టీసీ గమ్యస్థానాలకు చేర్చింది.
చాలా కార్యాలయాలు, ఇతర సంస్థల్లో సోమవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ రోజున ఆర్టీసీ ఆదాయం మెరుగ్గా ఉంటున్నది. ఆదివారం సెలవు కావడంతో ఊర్లకు వెళ్లి వచ్చేవారు, తప్పనిసరి పనులపై సోమవారం కార్యాలయాలకు వెళ్లేవారు.. తదితరాల కారణంగా ప్రతి సోమవారం ఆర్టీసీకి ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నెల 18(సోమవారం)న రూ.15 కోట్ల ఆదాయం వచ్చింది. ఇటీవల కాలంలో ఆర్టీసీకి ఒక్క రోజులో ఆదాయం 15 కోట్లకు చేరటం ఇదే తొలిసారి.