కాన్పూర్ : కట్నం కోసం అత్తింటి వారు కోడలిపై దారుణానికి పాల్పడ్డారు. ఆమెను గదిలో బంధించి అందులోకి పామును వదిలారు. ఈ ఘటన యూపీలోని కాన్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. రేష్మా వివాహం 2021లో షానవాజ్తో జరిగింది. పెండ్లయినప్పటి నుంచి వారు కట్నం కోసం వేధించేవారు. ఇటీవల రేష్మా కుటుంబం వారికి రూ.1.5 లక్షలు ఇచ్చారు. దీనికి సంతృప్తి పడని అత్తింటి వారు ఈ నెల 18న ఆమెను గదిలో బంధించి గదిలోకి విష సర్పాన్ని వదిలారు.
అది కాలిపై కాటేయడంతో ఆమె అరిచింది. దీంతో తలుపులు తెరిచిన అత్తింటి వారు నవ్వుతూ ఆమెను చూశారే తప్ప దవాఖానకు తీసుకు వెళ్లలేదు. బాధితురాలు ఎలాగోలా తన సోదరికి ఫోన్ చేయడంతో ఆమె వచ్చి రేష్మాను దవాఖానకు తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. భర్తతో పాటు అత్తింటి వారిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.