న్యూఢిల్లీ : భూ కక్ష్యలోకి పంపిన ఉపగ్రహాలను కాపాడుకోగలిగే సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు భారత్ ప్రయత్నిస్తున్నది. కక్ష్యలో తిరిగే రోదసి నౌకకు ఎదురయ్యే ముప్పును గుర్తించి, తిప్పికొట్టేందుకు బాడీగార్డ్ శాటిలైట్లను అభివృద్ధి చేయాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. పాకిస్థాన్‌పై మే నెలలో నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’లో శాటిలైట్ల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఈ వివరాలను తెలిసిన అధికారులను ఉటంకిస్తూ ‘బ్లూమ్‌బర్గ్’ ఈ కథనాన్ని ప్రచురించింది.
ఇస్రోకు చెందిన ఓ ఉపగ్రహం భూమిపై నుంచి సుమారు 500-600 కి.మీ. ఎత్తులో కక్ష్యలో తిరుగుతున్నది. నిరుడు ఈ ఉపగ్రహానికి దాదాపు 1 కిలోమీటర్ దూరానికి ఓ పొరుగు దేశపు ఉపగ్రహం వచ్చింది. అయితే, పెద్ద ప్రమాదం తప్పింది. ఇస్రో శాటిలైట్ భూమిపై గల వస్తువులు, లక్ష్యాలను మ్యాపింగ్, మానిటరింగ్ వంటి సైనికపరమైన కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ఉపగ్రహాలు ఒకదానికొకటి ఢీకొట్టే పరిస్థితులు ఉత్పన్నమైనపుడు, ఆ ప్రమాదాన్ని నివారించవలసి ఉంటుంది. దీనిపై ఇస్రో, అంతరిక్ష శాఖ స్పందించలేదు.
కక్ష్యలోకి మరిన్ని భద్రతాపరమైన శాటిలైట్లను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 50 నిఘా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.27 వేల కోట్లు ఖర్చవుతుంది. వీటిలో మొదటి ఉపగ్రహాన్ని వచ్చే సంవత్సరం ప్రయోగించే అవకాశం ఉంది. గడచిన ఏడు దశాబ్దాల్లో చైనా, పాకిస్థాన్లతో భారత్ యుద్ధం చేసింది. పాకిస్థాన్‌కు 8, భారత్‌కు దాదాపు 100, చైనాకు 930కిపైగా శాటిలైట్లు ఉన్నాయి. అంతరిక్షంలో చైనా శాటిలైట్లు పెను ముప్పుగా మారుతున్నాయని భారత్, అమెరికా అధికారులు హెచ్చరిస్తున్నారు. న్యూఢిల్లీలో జూన్‌లో నిర్వహించిన సెమినార్లో ఇండియన్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ మాట్లాడుతూ, చైనా శాటిలైట్ ప్రోగ్రామ్ సంఖ్యాపరంగా, ఆధునికతపరంగా కూడా వేగంగా విస్తరిస్తున్నదని చెప్పారు. దీనికి సరైన పరిష్కారాన్ని కనుగొనేందుకు భారత ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలతో కలిసి పని చేస్తున్నది. ఈ చర్చలు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నాయి. లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ శాటిలైట్లను ప్రయోగించాలన్న లక్ష్యంతో వీరు పని చేస్తున్నారు.