న్యూయార్క్/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. అయితే విదేశీ కంపెనీలతోపాటు స్వదేశీ సంస్థలనూ అగ్రరాజ్యాధినేత తీసుకున్న ఈ నిర్ణయం గట్టిగానే ప్రభావితం చేయనున్నది. ఇకపై నైపుణ్యం, ప్రతిభ కలిగిన విదేశీ ఉద్యోగులను పనిలో పెట్టుకోవాలంటే అమెరికాలోని సంస్థలు భారీ మొత్తాల్లో ఖర్చు చేయాల్సి వస్తున్నది మరి.
ఇలా ఇతర దేశాల వర్కర్లను అమెరికాలోకి తెచ్చుకోవడానికి అక్కడి సంస్థలు ఏటా రూ.1.24 లక్షల కోట్ల (14 బిలియన్ డాలర్లు)ను హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుములుగా చెల్లించాల్సి ఉంటున్నది. అయితే అమెరికాలో ఉన్న దేశ, విదేశీ సంస్థలు స్థానికులనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలనే ఈ నిర్ణయం అని ట్రంప్ సర్కారు సమర్థించుకుంటున్నా.. దీన్ని మాత్రం ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. ఈ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థనూ దెబ్బతీయగలదని హెచ్చరిస్తున్నారు. అందుకు తగ్గట్టే యూఎస్ కార్పొరేట్లు పెద్ద మొత్తాల్లో వర్క్ పర్మిట్ల కోసం వెచ్చించాల్సిన పరిస్థితి రాబోతున్నదంటూ వారంతా అంచనాలు వేస్తుండటం గమనార్హం.
అమెరికా సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వివరాల ప్రకారం గత ఏడాది కొత్తగా 1,41,000కుపైగా హెచ్-1బీ వీసాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఇదే స్థాయిలో వీసాల కోసం నూతన దరఖాస్తులు వస్తే.. పెంచిన ఫీజు ప్రకారం అమెరికన్ కంపెనీలు 14 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి రావచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. విదేశీ ఇంజినీర్లు, సైంటిస్టులు, కోడర్స్పై సిలికాన్ వ్యాలీ పెద్ద ఎత్తునే ఆధారపడుతున్నది. అందుకే ఏటా వీరిని భారీగానే ఉద్యోగాల్లో అక్కడి కంపెనీలు నియమించుకుంటున్నాయి.
ఈ క్రమంలో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలనూ అకౌంటెన్సీ, హెల్త్‌కేర్ తదితర రంగాలకు చెందిన కంపెనీలు విరివిగా వాడేస్తున్నాయని యూఎస్సీఐఎస్ తెలియజేస్తున్నది. అలాగే నిరుడు ఆమోదం పొందిన దాదాపు 4 లక్షలకుపైగా హెచ్-1బీ దరఖాస్తుల్లో ఎక్కువమంది తమ వీసాలను రెన్యువల్ చేసుకుంటున్నవారేనని తేలింది. మరోవైపు హెచ్-1బీ వీసా ఫీజు పెంపు అంశంపై చాలా అమెరికన్ సంస్థలు న్యాయ పోరాటం చేయాలని చూస్తున్నట్టు వాటి తరఫు న్యాయవాదులు చెప్తున్నారు. కోర్టుల్లో ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేసే వీలుందంటున్నారు. ఇప్పటికే టారిఫ్‌ల రగడ కోర్టుల మెట్లెక్కిన నేపథ్యంలో ఇది మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది.
హెచ్-1బీ వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకుంటేనే లక్ష డాలర్ల ఫీజు కట్టాల్సి ఉంటుందని, కాబట్టి దేశీయ సంస్థలపై ప్రభావం తక్కువగానే ఉంటుందని భారతీయ ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్ చెప్తున్నది. ఇప్పుడున్న వీసాదారులపై ఎలాంటి భారం పడబోదని అంటున్నది. నిజానికి ఇప్పటికే అమెరికాలోని భారతీయ, వాటి అనుబంధ సంస్థలు హెచ్-1బీ వీసాలపై ఆధారపడటం తగ్గించేశాయని, స్థానికులనే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయని నాస్కామ్ గుర్తుచేసింది.