న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: బంగారం భగ..భగ మండుతున్నది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పుత్తడి సోమవారం మరో ఉన్నత శిఖరాలను అధిరోహించింది. పాలసీ నిర్ణయాలపై అమెరికా ఫెడరల్ రిజర్వు అధికారి కీలక వ్యాఖ్యలపై పెట్టుబడిదారులు వేచి చూసేదోరణి అవలంభించారు. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు మరో రికార్డును సృష్టించాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పుత్తడి ధర మరో రూ.2,200 ఎగబాకి రూ.1,16,200 పలికింది. అంతకుముందు ఇది రూ.1.14 లక్షలుగా ఉన్నది.
అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగి పుత్తడి ధర రూ.2,150 ఎగబాకి రూ.1,15,650కి చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ కారణంతో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ప్రస్తుత సంవత్సరంలో బంగారం ధర రూ.37,250 లేదా 47.18 శాతం పెరిగింది. డిసెంబర్ 31, 2024న రూ.78,950గా ఉన్న గోల్డ్ ధర ప్రస్తుతం రూ.1.16 లక్షలు దాటింది.
బంగారంతోపాటు వెండి కూడా చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకింది. కిలో వెండి ఏకంగా రూ.4,380 ఎగబాకి రూ.1,36,380కి చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.1.32 లక్షలుగా ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి పెద్దగా కొనుగోళ్లు లేకపోయినప్పటికీ అంతర్జాతీయంగా భారీగా పుంజుకోవడం వల్లనే దేశీయంగా రికార్డు స్థాయికి ఎగబాకిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత ఏడాది ఇప్పటి వరకు కిలో వెండి రూ.46,680 లేదా 52.04 శాతం ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధర పుంజుకుంటున్నది. ఔన్స్ గోల్డ్ ధర ఒక్క శాతం ఎగబాకి 3,728.43 డాలర్లకు చేరుకోగా, వెండి 43.61 డాలర్లకు ఎగబకాఇంది.