న్యూఢిల్లీ : విమానం చక్రాల వద్ద ఉండే ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్ లోపల దాక్కుని ఓ అఫ్గానిస్థాన్ బాలుడు(13) ఆదివారం కాబుల్ నుంచి ఢిల్లీ చేరుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే ఆ బాలుడిని అఫ్గాన్‌కు పంపించి వేసినట్లు సోమవారం అధికారులు వెల్లడించారు.
ఉదయం నంబర్ ఆర్క్యూ-4401 విమానం చుట్టూ తిరుగుతున్న ఓ బాలుడిని గుర్తించిన కేఏఎం ఎయిర్‌లైన్స్ అధికారులు వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. ఆ విమానం ల్యాండింగ్ అయి అప్పటికి అరగంట మాత్రమే అయింది. విమానంలోని వెనుక సెంట్రల్ ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్ లోపల దాక్కుని తాను ప్రయాణించినట్లు ఆ బాలుడు వెల్లడించాడు.