Illegal Sand Transport | మాగనూరు (కృష్ణ) 17: నారాయణపేట జిల్లా పరిధిలోని కృష్ణానదిలో రాత్రి వేళ అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని మండల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పలుమార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో అవి అమలవడం లేదని ఆరోపిస్తున్నారు.
రాత్రి వేళల్లో భారీ టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయం స్పందించకపోవడంతో అక్రమ రవాణాకు పరోక్షంగా ప్రోత్సాహం లభిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కృష్ణ ఎస్సై అండదండలతోనే ఈ ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, నిజానిజాలను వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు.
కాగా, ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వం కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోతుందని.. నదీ పరివాహక ప్రాంత పర్యవరణానికి కూడా ఇది తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.