AP News | ఎనిమిదేళ్లుగా ప్రేమించిన యవకుడు మోసం చేయడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని తట్టుకోలేకపోయింది. తనను కాదని వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో బాధిత కుటుంబసభ్యులు ప్రియుడు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మృతురాలి మెడలో తాళికట్టి న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందురులో ఈ ఘటన చోటుచేసుకుంది.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడు గ్రామానికి చెందిన అడ్డగళ్ల కీర్తి (24) ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఖతార్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న పొందూరుకు చెందిన పాపినేని సాయి అనే యువకుడితో 8 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారడంతో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే వారం కిందట సాయికి అతని కుటుంబసభ్యులు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు.
ఈ విషయం తెలిసిన కీర్తి ముంబై నుంచి నాలుగు రోజుల కిందట ఒంగోలు వచ్చి సాయి తల్లిదండ్రులను కలిసింది. సాయితో వివాహం చేయాలని కోరింది. అయితే అందుకు సాయి కుటుంబసభ్యులు నిరాకరించారు. అంతేకాకుండా బెదిరింపులకు దిగారు. దీంతో సాయిని మరిచిపోవాలని ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పారు. అనంతరం కీర్తి ముంబైకి వెళ్లిపోయింది. ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఈ నెల 14వ తేదీన ముంబైలో ఉరేసుకుంది. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని కీర్తి కుటుంబసభ్యులకు గురువారం అప్పగించారు.
కీర్తి సూసైడ్‌తో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె కుటుంబసభ్యులు, బంధువులు పొందూరులోని సాయి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. కీర్తి మృతదేహాన్ని ఇంటి వరండాలో ఉంచి తమకు న్యాయం చేయాలని నిరసన తెలిపారు. సాయి చేత మృతురాలి మెడలో తాళి కట్టించి, అంత్యక్రియలు నిర్వహించాలని పట్టుబట్టారు. ఆ సమయంలో సాయి ఇంట్లో ఎవరూ లేరు. విషయం తెలుసుకున్న టంగుటూరు పోలీసులు వచ్చి దీనిపై సాయి బంధువులు, కీర్తి బంధువులతో చర్చించారు. అనంతరం సాయి బంధువులు కలగజేసుకుని తమ సంప్రదాయం ప్రకారం మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. కాగా, కీర్తి ఆత్మహత్య గురించి తెలుసుకుని సాయి ఖతార్‌కు వెళ్లిపోయాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.