మామిళ్లగూడెం, నవంబర్ 23 : ఖమ్మం జిల్లాలో గుట్టలు మాయమవుతున్నాయి. మైనింగ్ మాఫియా పంజాలో పడిన గుట్టలన్నీ బొందల గడ్డలవుతున్నాయి. అధికార పార్టీ నేతల కన్నుసన్నల్లో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. అనుమతులు లేకుండానే లారీలకు లారీల మట్టి తరలివెళ్తోంది. ప్రభుత్వ పనుల పేరుతో పగటి వేళ మట్టి తవ్వాకాలు, తోలకాలు జరుగుతున్నాయి. రాత్రి అయ్యాక మాత్రం ప్రైవేటు కార్యాలకు మళ్లుతున్నాయి. విలువైన వృక్ష సంపదను నిలువునా కూల్చుతూ, పశుపక్షుల ఆవాసాలను ధ్వంసం చేస్తూ ఎకరాల కొద్దీ విస్తీర్ణంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. పర్యావరణ దెబ్బతింటున్నా, భూములన్నీ బీళ్లుగా మారుతున్నా వెనుకడుగు వేయని మట్టి మాఫియా.. మరింతగా రెచ్చిపోతూ ముందుకు సాగుతూనే ఉంది. భారీ గుంతలు ప్రాణాంతకంగా మారినా మైనింగ్ మాత్రం విరామం లేకుండా ముందుకెళ్తోంది.
ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని ధంసలాపురం రెవెన్యూలో మట్టి దంగాకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. శ్రీనివాసనగర్ నుంచి, మున్నేటి పక్కనుంచి, ధంసలాపురం కాలనీకి వెళ్లే దారి వరకూ ఉన్న భూముల్లో మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ధంసలాపురం కాలనీ వద్ద న్యాయస్థానంలో వివాదంలో ఉన్న గుట్టను కూడా అక్రమార్కులు మాయం చేస్తున్నారు. ఈ మట్టిని మున్నేరు కేబుల్ బ్రిడ్జి అవసరాలకు తరలిస్తున్నామని చెప్పుతూనే ప్రైవేటు పనులకు విక్రయిస్తున్నారు. గడిచిన నెల రోజులుగా సాగుతున్న ఈ అక్రమ తవ్వకాలను మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖలు ‘మామూలు’గానే తీసుకుంటుండడం గమనార్హం.
రఘునాథపాలెం మండలంలోని కోయచెలక, పీర్లగుట్ట, మల్లేపల్లి, శివాయిగూడెం ప్రాంతాల్లో వేలాది టిప్పర్లతో అర్ధరాత్రి వేళల్లో మట్టి దందా కొనసాగుతోంది. అక్రమ తవ్వకాలు చేస్తున్న వారు ప్రధాన రహదారుల వెంట కాపాలాగా ఉండి ఉన్నతాధికారుల రాకపోకలను గమనిస్తున్నారు. ఎవరైనా కన్పిస్తే జేసీబీలు, టిప్పర్లు, ఇతర యంత్రాల డ్రైవర్లను అప్రమత్తం చేస్తూ తప్పిస్తున్నారు. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడంతో మాఫియా రాయుళ్ల వ్యాపారం నిరాటకంగా కొనసాగుతోంది. ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్లు, ఆరెంపుల, గోళ్లపాడు, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పోలేపల్లి, వెంకటగిరి, గుదిమళ్ల, గుర్రాలపాడు, తెల్దారుపల్లి, మద్దులపల్లి గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో మట్టి తవ్వకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జేసీబీలు, పొక్లెయినర్లతో వందల టిప్పర్ల మట్టిని తవ్వి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.
అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి క్వారీలు నిర్వహించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. అనుమతులు తీసుకోవడం, రుసుములు చెల్లించడం వంటి ప్రహసనంతో కూడుతున్న పనులు కావడం, అసలు అనుమతులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉండడం వంటి కారణాలతో అక్రమార్కులు అడ్డదారుల్లో మైనింగ్ చేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులకు మామూళ్ల ఎరవేసి, ప్రభుత్వ ఆదయానికి ఎగనామం పెట్టి మట్టి తవ్వకాలు కానిచ్చేస్తున్నారు. ఇంత బహిరంగంగా మైనింగ్ జరుగుతున్నా చివరికి టాస్క్‌ఫోర్స్ అధికారులు కూడా దృష్టిపెట్టకపోవడం గమనార్హం.
అధికార పార్టీ నేతల కనుసన్నల్లో..
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, రఘునాథపాలెం మండలాల్లో అక్రమ మైనింగ్ మాఫియా మట్టి వ్యాపారం రూ.కోట్లలో సాగుతోంది. అయితే, ఈ అక్రమ మైనింగ్‌కు అధికార పార్టీకి చెందిన నాయకుల నుంచి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. మట్టి వ్యాపారులు నెలల వారీగా అధికార పార్టీ నేతలకు ముడుపులు చెల్లిస్తుండడంతో వారి కనుసన్నల్లోనే ఈ వ్యాపారం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా కొనసాగుతోంది. ఈ మట్టి క్వారీలవైపు కన్నెత్తి కూడా చూడాకుండా అధికారులను అధికార పార్టీ నేతలు శాసిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అనుమతుల్లేకుండా..ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో మట్టి, ఇతర ఖనిజాల తవ్వకాల కోసం కచ్చితమైన నిబంధనలు పాటించాల్సిన ఉంటుంది. సంబంధిత మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరి. మట్టి తవ్వకాల కోసం అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్న కొందరు మాఫియా రాయుళ్లు అవి రాకుండానే తమ కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నించినా.. అనుమతులు తీసుకున్నామని బకాయిస్తూ అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు. మట్టి కోసం గుట్టల్లో సుమారు 20 అడుగుల గుంతలు తవ్వడంతో అవి ప్రమాదకరంగా మారుతున్నాయి. అక్రమ వ్యాపారం చేస్తున్న వారు ప్రైవేటు వెంచర్లకు, భవన నిర్మాణాలకు ఒక్కో ట్రిప్పు టిప్పర్
మట్టిని రూ.6 వేలకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు, నిర్మాణాల పేరుతో పదుల సంఖ్యలోని టిప్పర్లతో మట్టిని తరలిస్తున్న వ్యాపారులు.. ప్రైవేటు విక్రయాలకు మాత్రం వేలాది ట్రిప్పులను మళ్లిస్తుండడం గమనార్హం.