కామారెడ్డి, నవంబర్ 23: రైలు ఢీకొని 80 గొర్రెలు మృతిచెందిన ఘటన కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్నది. కామారెడ్డి బల్దియా పరిధిలోని దేవునిపల్లికి చెందిన దర్శపు సుధాకర్(35) మరో వ్యక్తితో కలిసి గొర్రెలను మేపడానికి పట్టణంలోని ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలోకి తీసుకెళ్లాడు. గొర్రెలను రైల్వే ట్రాక్‌ను దాటిస్తుండగా.. రైలు వేగంగా వచ్చి గొర్రెలను ఢీకొన్నది. దీంతో 80 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. భయపడిన సుధాకర్ పక్కనే ఉన్న వాగులోకి దూకగా ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. రెస్క్యూటీం గాలింపు చర్యలు చేపట్టగా.. సాయంత్రం అతడి మృతదేహం లభించింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.