హనుమకొండ, నవంబర్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మొంథా తుపాను వరద బాధితులను కాంగ్రెస్ సర్కారు మరింత కష్టాలు పెడుతున్నది. హామీలను, సంక్షేమాన్ని వాయిదా వేస్తున్న ప్రభుత్వం.. వరద బాధితులకు అందించే తక్షణ సాయాన్ని ఆలస్యం చేస్తున్నది. గత నెల 29న మొంథా తుపాను వరంగల్ మహానగరాన్ని అతలాకుతలం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చి ఇండ్లు మునిగిన వారికి తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.15వేలు, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇస్తామని ప్రకటించారు. నగరంలో 6,465 కుటుంబాలు నష్టపోయాయని అధికారులు నివేదిక రూపొందించగా, వారికి తక్షణ సాయం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ప్రతిపాదించారు. స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ప్రకటించినా, అధికారులు నివేదికలు రూపొందించినా సర్కారు సాయం అందడం లేదు.
నిధులు విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించినా ఆ సమాచారం తమకు తెలియడం లేదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులు చెబుతున్నారు. వరదలు వచ్చినప్పుడు బాధితులకు ఎలాంటి ఆసరా ఉండదు. రోజువారీ పనులకు వెళ్లలేక, ఆదాయం లేక అన్నింటికి అవస్థ పడుతుంటారు. ఇలాంటి కుటుంబాలకు వెంటనే అందించేది తక్షణ సాయం. వరదలు వచ్చి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదు. సర్కారు సాయంపై ఆశలు వదిలేసుకున్న బాధితులు కష్టాలను దిగమింగుకుంటూ రోజువారీ పనులకు పోతున్నారు. విపత్తులు వచ్చినా స్పందించని సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క రోజు హడావుడి
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పూర్తిగా బాధ్యతలను విస్మరించింది. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు హడావుడి చేశారు. బాధితులకు తక్షణ సాయంపై, వరదలతో జరిగిన నష్టంపై, పునరుద్ధరణ పనులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. వరంగల్ నగర ముంపునకు శాశ్వత పరిష్కారంపైనా దృష్టిపెట్టడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన తక్షణ సాయం అందించే విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధుల తరహాలోనే ఉన్నతాధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. రూ.50కోట్ల మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదించామని, దీనిపై స్పందన రావాల్సి ఉన్నదని చెబుతున్నారు.
కొట్టుకపోయినా మంచిగుండు
వరదలు వచ్చినప్పుడు కొట్టుకపోయిన మంచిగుండు. అధికారులు రాసుకపోయిండ్లు గానీ ఒక్క రూపాయి ఇయ్యలే. బియ్యం, పప్పులు, ఉప్పులు, బట్టలు కొట్టుకుపోయినయ్. కాంగ్రెస్ నాయకులు వచ్చి అయ్యో పాపం అన్నరు తప్ప సర్కారు సాయం రాలె. సర్కారు ఎప్పుడిస్తదో ఏమో.
-ప్రమీల, సమ్మయ్యనగర్
సీఎం వచ్చినా ఏం లాభం?
వరదలు వచ్చినప్పుడు సీఎం రేవంత్ మాకెళ్లి రాలె. నాలుగు ఇండ్లు చూసి పోయిండు. సీఎం మా స్థితి చూడకుండానే పోయిండని ఆఫీసర్లను అడిగినం. ఇండ్లు మునిగిన అందరికీ సాయం అందుతదన్నరు. ఇప్పటి వరకు రూపాయి రాలె. కొడుకు హాస్టల్ పనికి పోతెనే ఇల్లు గడుత్తది. సర్కారు ఏదో ఒకటి చెయ్యాలె.
– జెనివాల్ నీమా, హనుమకొండ
బ్యాంక్ బుక్కులు తీసుకుపోయిండ్లు
ఆఫీసర్లు వచ్చి బ్యాంకు బుక్కులు తీసుకపోయిండ్లు. అకౌంట్ల పైసలు పడుతయని చెప్పిండ్లు. సర్కారు చెప్పిన సాయం ఇయ్యలె. ఇంట్ల అన్ని సమాన్లు ఖరాబైనయి. బియ్యం, సరుకులు రోజురోజుకు కొనుక్కుని తింటున్నం.
– పులిచేరు సారమ్మ, సమ్మయ్యనగర్
ఏం ఇయ్యలే
వానల ఇంట్ల ఉన్న సామాన్లన్ని కొట్టుకపోయినయ్. వరదలు ఉన్నప్పుడు పూట మందం బియ్యం ఇచ్చి పోయిండ్లు. మళ్లొచ్చి రాసుకపోయిండ్లు. పైసలు పడుతయని ఆఫీసర్లు చెప్పిండ్లు. ఇప్పటిదాకా ఏం రాలె. అంత వాన ఎప్పుడూ సూడలె. సర్కారు మాకు ఏదన్న చేయాలె.
-తూర్పాటి సమ్మయ్య, సమ్మయ్యనగర్