రంగారెడ్డి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టు ఉన్నది. ఫ్యూచర్‌సిటీ అంటూ ఊదరగొడుతూ గత బీఆర్ఎస్ సర్కారు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములనే గ్లోబల్ సమ్మిట్‌కు వినియోగించుకుంటున్నది. ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫార్మా అనుబంధ సంస్థలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటీ నేటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో అసలు ఫార్మాసిటీ ఉన్నట్టా.. లేనట్టా? అనే అనుమానం కలుగుతున్నది. ఫార్మాసిటీని రద్దు చేస్తే ఆ భూములు తిరిగి రైతులకే ఇస్తామన్న మాటపై నిలబడటం లేదని విమర్శలున్నాయి.
గ్లోబల్ సమ్మిట్‌కు ఫార్మా భూములే దిక్కు..
కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్ గ్రామంలో సర్వే నంబర్ 120లో 650 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ భూమి మీర్ఖాన్పేట్తో పాటు చుట్టుపక్క గ్రామాలకు చెందిన సుమారు 300మంది రైతులకు గతంలో అసైన్డ్ పట్టాలిచ్చారు. అందులో 150 ఎకరాలు పవర్‌గ్రిడ్, అమెజాన్‌కు కేటాయించారు. మిగతా 400 ఎకరాలను గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించింది. రైతులకు పరిహారం అందించగా ప్రస్తుత ఆ భూమి టీజీఐఐసీ పేరిట రికార్డుల్లో ఉన్నది. ఈ భూమిలో కొంతభాగాన్ని ఫార్మా బాధిత రైతుల కోసం వెంచర్‌చేసి ప్లాట్లు కేటాయించారు. ప్రస్తుతం ఈ భూములే గ్లోబల్ సమ్మిట్‌కు దిక్కయ్యాయి. హెలిప్యాడ్‌తో పాటు సమ్మిట్‌కు కోసం వచ్చే ప్రతినిధుల కోసం సమావేశ మందిరాలను ఏర్పాటుచేస్తున్నారు. ఈ హెలిప్యాడ్ నుంచి వచ్చిన వారు ఫార్మా రైతుల కోసం ఏర్పాటుచేసిన 300 ఫీట్ల రోడ్డు మార్గాన సమ్మిట్ సమావేశానికి చేరుకోనున్నారు.
పేరుకే ఫ్యూచర్‌సిటీ..
ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీ నిర్మిస్తున్నట్టు గొప్పగా చెప్పుకుంటున్నా ఆ భూములను మాత్రం ఫార్మాసిటీ కోసం సేకరించినవే కావటం గమనార్హం. ఇప్పటికే ఫ్యూచర్‌సిటీలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఇతర కంపెనీలకు కేటాయించిన భూములు కూడా ఫార్మాసిటీ కోసం సేకరించినవే. అలాగే, ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం కూడా ఆ భూముల్లోనే నిర్మిస్తున్నారు. ప్యూచర్సిటీని 30వేల ఎకరాల్లో నిర్మిస్తామని చెప్తున్న ప్రభుత్వం కొత్తగా భూమి సేకరించలేదు. ఫార్మాసిటీ కోసం సేకరించిన 14వేల ఎకరాలను ఫ్యూచర్‌సిటీ కోసం వాడుకోవాలని ప్రభుత్వం చూస్తున్నది. కానీ, కోర్టులో మాత్రం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫార్మా అనుబంధ కంపెనీలు మాత్రమే ఏర్పాటు చేస్తామని అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ, ఈ భూములను ఫ్యూచర్‌సిటీకి వాడుకుంటూ ప్రభుత్వం కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నదనే ఆరోపణలున్నాయి. ఫార్మాసిటీ నిర్మించకపోతే ఆ భూములను తిరిగి రైతులకే ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఫార్మాసిటీపై ఎలాంటి స్పష్టత ఇవ్వటం లేదు.
మీడియాకు నో ఎంట్రీ
సీఎం రేవంత్‌రెడ్డి గ్లోబల్ సమ్మిట్ పరిశీలన కవరేజీ కోసం వచ్చిన మీడియాను అనుమతించలేదు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు సీఎం రాక కోసం ఎదురుచూడగా మధ్యాహ్నం 2గంటల తర్వాత హెలికాప్టర్లో వచ్చి రోడ్డు మార్గంలో సమ్మిట్‌కు అధికారులతో సమావేశమయ్యారు. అయితే పోలీసులు అక్కడకు మీడియాను అనుమతించకపోవడంతో రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. జడ్పీ మాజీ చైర్పర్సన్ అనితారెడ్డిని కూడా అనుమతించకపోవడంతో ఆమె తిరిగి వెళ్లిపోయారు.
గ్లోబల్ సమ్మిట్ పకడ్బందీ ఏర్పాట్లు : సీఎం
ప్యూచర్ సిటీలో భాగంగా వచ్చే నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలను చేశారు. వివిధ దేశాల ప్రతినిధులతో పాటు రాయబారులు హజరవుతువున్ననందున ఆమేరకు ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలను చేపట్టాలని తెలిపారు. సమ్మిట్‌కు సంబంధం లేని వారికి అనుమతి ఇవ్వకూడదని చెప్పారు. పాస్‌లు ఉన్నవారికి అనుమతిని ఇవ్వాలని స్పష్టం చేశారు. సీఎం వెంట ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, మనోహర్‌రెడ్డి, కమిషనర్ శశాంక, వెంకట్‌నర్సింహరెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, మధుయాష్కీగౌడ్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, చల్లా నర్సింహరెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు.