కొండాపూర్ : చెరువుల్లో ఇండ్లను నిర్మించుకున్నారంటూ కూల్చివేస్తున్న హైడ్రా అధికారుల కు ఏకంగా చెరువులోని అక్రమ పార్కింగ్‌ను ( Illegal parking ) చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఐటీకి కేరాఫ్‌గా, పర్యాటకానికి పేరొందిన దుర్గం చెరువు ( Durgam Lake ) లో అక్రమంగా మట్టి నింపి, వందలాది ప్రైవేట్ బస్సులను( Private Buse) కొంతకాలంగా పార్కింగ్ చేస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలపై విరుచుకుపడుతున్న హైడ్రా సైతం అటుగా చూడకపోవడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల కనుసన్నల్లోనే అక్రమ పార్కింగ్ కొనసాగుతుందా అన్న ఆరోపణలు వినబడుతున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే.. ప్రస్తుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వం దుర్గం చెరువు అభివృద్ధిని గాలికొదిలేసింది. డ్రైనేజీ మురుగు నీరు చేరుతుండడడంతో వాకర్స్, సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే చెరువులోని నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోవడంతో చేపలు చనిపోయాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా అధికారులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పటికీ ఎలాంటి స్పందన లేకుండా పోయింది.
పార్కింగ్ పై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాం : ఇరిగేషన్ ఈఈ
దుర్గం చెరువులో అక్రమ పార్కింగ్ పై ఫిర్యాదు అందిందని ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి ( EE Srinivas Reddy ) పేర్కొన్నారు. దీనిపై నాలుగు రోజుల క్రితం శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేశాం. వెంటనే అక్రమ పార్కింగ్ కు పాల్పడుతున్న వారిపై తగు చర్యలు తీసుకుంటాం. చెరువులోని మట్టిని తొలగించి, అభివృద్ధిలోకి తీసుకొస్తామని వెల్లడించారు.