Park Encroachment | కుత్బుల్లాపూర్, జూలై 30 : కబ్జాకు కాదేది అడ్డు అన్నట్లుగా మారింది.. ఇక్కడి కబ్జారాయుళ్లు పార్కు స్థలానికి కన్నం వేశారు. కోట్లు గడించేందుకు పన్నాగం పన్నుతున్నారు. అధికారాన్ని గుప్పిట్లోకి తీసుకొని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి దాదాపుగా 741 గజాల స్థలం సుమారు రూ.6 కోట్లకుపైగా పార్కును దర్జాగా ప్లాట్లుగా మార్చుకున్నారు. గతంలో అధికార యంత్రాంగం పలుమార్లు పార్కును కబ్జా చేస్తే.. కబ్జా చెరలో నుండి విముక్తి కల్పించింది. కానీ చట్టాన్ని కూడా చివరకు చుట్టంలా మార్చుకొని కోర్టు స్టే ఆర్టర్ ఉందని బుకాయిస్తూ పార్కు స్థలాన్ని మాయం చేశారు. దీనిపై హైడ్రా తీసుకునే చర్యలపై స్థానికులు ఎదురుచూస్తున్నారు.
అతిపెద్దగా ఉండే పార్కును కబ్జా చేసేందుకు..
ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ జేకే నగర్లో పార్కు మాయాజాలం. సుభాష్ నగర్ డివిజన్ జేకేనగర్‌లో 2000 సంవత్సరంలో సర్వే నంబర్ 236/ ఈలో సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్‌ను చేశారు. అదే సమయంలో ఐదు పార్కులను కేటాయించగా అందులో ఒకటి ప్రస్తుతం కబ్జాకు గురైన పార్కు. కాగా గతంలోనే మిగిలిన నాలుగు పార్కులు కబ్జాకు గురికాగా.. వీటిలో అతిపెద్దగా ఉండే ఈ పార్కును కబ్జా చేసేందుకు దాదాపు ఆరేండ్ల నుండి ప్రయత్నాలు సాగుతున్నాయి. పలుమార్లు కబ్జాకు గురికావడంతో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు.
కాగా కొంతమంది వ్యక్తులు తప్పుడు ధృవీకరణపత్రాలను సృష్టించి 741 గజాల స్థలాన్ని నాలుగు ప్లాట్లుగా విభజించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించి 2021లో కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగం నుండి కబ్జా చేసిన స్థలంలో ఇండ్లు నిర్మించుకునేందుకు మూడు ప్లాట్లకు అనుమతులు తీసుకున్నారు.
చేతులేత్తేసిన అధికారయంత్రాంగం.. పార్కు స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవడమే కాకుండా.. దానిలో నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు కూడా తీసుకున్న సదరు నిర్మాణదారుడు నేరుగా కోర్టుకు వెళ్లాడు. దీంతో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉందంటూ యధేచ్చగా పార్కు చుట్టూ ప్రహారీని నిర్మించి, అందులో షెల్టర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు అది మా పరిధిలోకి రాదంటూ తప్పుకున్నారు.
మరో పక్క కుత్బుల్లాపూర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంజక్షన్ ఆర్డర్ ఉందంటూ చేతులెత్తారు. దీంతో కండ్ల ముందటే ఆక్రమణ దారులు యధేచ్చగా పార్కు స్థలాన్ని మాయం చేస్తున్న క్రమంలో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై హైడ్రా అధికారులు చొరవ తీసుకొని పార్కు స్థలాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు.
Madhira : బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ : చిత్తారు నాగేశ్వర్రావు