మధిర, జూలై 30 : కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని బీసీ సంఘం ఖమ్మం జిల్లా నాయకుడు, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వర్రావు అన్నారు. బీఆర్ఎస్ మధిర పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు రిజర్వేషన్ ఏర్పాటు చేయకుండా, నెపాన్ని బీజేపీపై నెట్టి కాంగ్రెస్ డ్రామాలు ఆడుతూ బీసీ ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. పార్లమెంట్లో చట్టం చేయకుండా బీసీ రిజర్వేషన్ ఆమోదానికి అవకాశం ఉండదని తెలిసి కూడా ఎన్నికల ముందు దొంగ హామీలు ఇచ్చారని మండిపడ్డారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి రాష్ట్రపతికి పంపించి మరలా ఇక్కడ ఆర్డినెన్స్ పేరుతో దొంగ నాటకం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గవర్నర్ న్యాయ సలహాకు పంపడం ద్వారా కాంగ్రెస్ ఆడిన నాటకం బయటపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఒక నాటకమే అన్నారు. బీజేపీ వారు బీసీ జాబితాలో ముస్లింలు ఉన్నారని, తాము దానికి సపోర్టు ఇవ్వమని కాంగ్రెస్తో కలిసి నాటకం ఆడుతుందన్నారు. రాబోయే కాలంలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం పోరాటం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 8న కరీంనగర్లో భారీ బహిరంగ సభ ద్వారా తమ పోరాటం ఉధృతం కానున్నట్లు చెప్పారు. పోరాటాల ద్వారా బీసీ హక్కులను సాధించుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను, చేతగానితనాన్ని ప్రతి బీసీ ఇంటికి వెళ్లి తెలుపనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి అరిగ శ్రీనివాసరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, మాజీ కౌన్సిలర్ వై వి. అప్పారావు, మాజీ సర్పంచులు మేడిశెట్టి నాగేశ్వరరావు, సవరం వెంకటేశ్వర్లు, చింతల కృష్ణ, బీసీ నాయకులు ముత్తవరపు ప్యారి, మునగా వీరబాబు, చీదిరాల రాంబాబు, లంకెమల్ల నాగేశ్వరరావు, నాగులవంచ రామారావు, మెట్టెల ప్రసాదు, కంచం గోపి, సంపసాల కొండ, ఆరుద్ర కొండలరావు, కోలా కొండ, శివ, రాంబాబు పాల్గొన్నారు.