RS Praveen Kumar | హైదరాబాద్ : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గద్దె దిగితే తప్ప శాంతి భద్రతలు అదుపులోకి రావు అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో మండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి చారి నేతృత్వంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ కుమార్ ఇద్దరు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఫోన్లు చేసి చంపుతామని బెదిరిస్తున్నారు. రోడ్డు మీద 300 వాహనాలతో ట్రాఫిక్ చేసి న్యూసెన్స్ చేశారు. బూతులు మాట్లాడుతున్న వారిపైన కేసులు పెట్టడం లేదు. తెలంగాణ గూండాల పాలయ్యింది. వీళ్ళు బెదిరిస్తున్న పోలీసులు పట్టించుకోవడం లేదు. మైనంపల్లి గూండాగిరి రాజ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేసి గుండా యాక్ట్, పీడి యాక్ట్ కేసులు పెట్టాలి. డీజీపీ వీటిపైన దృష్టి పెట్టాలి. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వీళ్ళను వదిలిపెట్టం అని ఆర్ఎస్పీ హెచ్చరించారు.
ముఖ్యమంత్రి చేతిలోనే హోంశాఖ కూడా ఉంది. అయినా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. రక్షించాల్సిన పోలీసులు, ప్రశ్నించిన వారిపైన కేసులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గద్దె దిగితే తప్ప శాంతి భద్రతలు అదుపులోకి రావు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.