ఆధ్యాత్మిక ప్రపంచం అబ్బురపడేలా
నారసింహ వైభవాన్ని నలుదిక్కులా
చాటిన అపూర్వ ఘట్టం
యాదాద్రి దివ్య క్షేత్రం పునరావిష్కారం!
సిద్ధించిన సీఎం కేసీఆర్ మహా సంకల్పం..
యాదాద్రీశుడి నిజరూప దర్శనం..
నేత్రపర్వం.. మహాకుంభ సంప్రోక్షణ పర్వం..
ఓం నమో నారసింహాయ!!
కృష్ణశిలా వైభవం..
ఇల వైకుంఠం.. మన ఇలవేల్పు నిలయం..
అడుగు మోపిన జన్మధన్యం!!!
ఏకశిఖరవాసుడు, స్వయంభు పంచనారసింహుడు కొలువైన యాదాద్రి క్షేత్రంలో మహాద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ధృఢసంకల్పంతో పునర్నిర్మితమైన ఆలయం పునరావిష్కారం అంగరంగ వైభవంగా సాగింది. వేదమంత్రోచ్ఛారణ, నమో నారసింహాయ స్మరణ నడుమ.. మిథున లగ్నంలో సోమవారం ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ నేత్రపర్వంగా జరిగింది. సరిగ్గా 12.30గంటలకు మూలవర్యుల దర్శనభాగ్యం కలిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా గర్భాలయంలోకి వెళ్లి తొలిపూజలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రుడయ్యారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు ఈ మహాక్రతువులో పాల్గొని పునీతులయ్యారు. నవ యాదాద్రిని చూసి భక్తజనులు సంతోషంతో పులకరించిపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత స్వామివారిని దర్శించుకుని కరుణాకటాక్షాలు పొందారు.
సీఎం కేసీఆర్ ప్రహ్లాద స్వరూపుడై నవ యాదాద్రికి సంకల్పించగా, ఆ మహాయజ్ఞంలో భాగస్వాములై ఇల వైకుంఠాన్ని సాక్షాత్కరింపజేయడంలో ఎందరో నిపుణుల కృషి ఉంది. ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంలో చారిత్రక,
ఆధ్యాత్మిక వైభవాన్ని కృష్ణ్ణశిలారూపంలో నిక్షిప్తం చేసి, వెయ్యేండ్లు వర్ధిల్లేలా ప్రధానాలయాన్ని పునర్నిర్మించారు. ఆ అసమాన ప్రతిభను, విశేష కృషిని గుర్తిస్తూ ఆలయ పునఃప్రారంభం సందర్భాన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి వారిని సన్మానించారు.
శ్రీగిరి క్షేత్రం ఇల వైకుంఠంగా మారింది. గోవింద నామస్మరణతో ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరిసింది. అబ్బురపడే కృష్ణ శిలలు, సప్త గోపురాలతో సరికొత్త రూపాన్ని సంతరించుకున్న యాదాద్రి క్షేత్రాన్ని చూసి భక్తులు ఆనందపరవశులయ్యారు. త్రిమూర్తుల సమన్వయ శక్తితో తేజరిల్లే ఏకైక పరబ్రహ్మ స్వరూపమైన నృసింహుడిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. ఆరేండ్ల తర్వాత కలిగిన స్వామి దర్శన భాగ్యానికి భారీగా భక్తులు తరలివచ్చారు. సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా స్వయంభువులకు తొలి పూజ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, ఉన్నతస్థాయి అధికారులు ఈ మహోత్సవంలో పాలుపంచుకున్నారు. భక్తులు మెచ్చేలా ఆలయ అధికారులు వసతులు కల్పించారు. రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో పకడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. యావత్ ప్రపంచంలోనే ఇది అరుదైన ఘట్టం. ఇటువంటి అపూర్వకార్యంలో సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో జిల్లా మంత్రిగా పాలు పంచుకోవడం
మహద్భాగ్యంగా భావిస్తున్నాను. అత్యంత ఎత్తయిన సప్తతల రాజగోపురంపై మహాసంప్రోక్షణ చేసే అవకాశం దక్కడం మహాదృష్టం. అన్నీ తానై శిల్పి అవతారమెత్తి యాదాద్రి క్షేత్ర పునర్నిర్మాణం రూపంలో కేసీఆర్
మరో అద్భుతాన్ని సృష్టించారు.
-గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి