జమ్మికుంట: దళితవాడల నుంచి పేదరికాన్ని తరిమికొట్టేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్నారని, ఇలాంటి పథకం ప్రపంచలోనే లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జమ్మికుంటలో శుక్రవారం ఆయన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 18.5 శాతం మంది దళితులున్నారని, అందులో అత్యధికులు నిరుపేదలేనని అన్నారు. వారిలో పేదరికాన్ని రూపుమాపేందుకే దళితబంధు పథకం తీసుకొచ్చినట్లు వివరించారు.
ఈ పథకంతో దళితుల బతుకులు బాగుపడితే తమ ఆటలు సాగవని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. అందుకే దళితులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఖాతాలో పడ్డ దళితబంధు పైసలు రివర్స్ వెళ్లిపోతాయని దళితులను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఒకసారి డబ్బులు ఖాతాలో పడితే వెనక్కు ఎలా వెళ్తాయని ప్రశ్నించారు. ఈ జూటా మాటలను దళితులెవరూ నమ్మవద్దని కోరారు. ఈ ఏడేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు చేశామని, అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని ఈశ్వర్ వెల్లడించారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రాజ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు కోటి, రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.