– కాంట్రాక్టు కార్మిక జేఏసీ హెచ్చరిక
బూర్గంపహాడ్, ఏప్రిల్ 23 : 29 రోజులుగా ఎండను సైతం లెక్కచేయకుండా సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేపడుతున్నాం.. ఐటీసీ పెద్దలారా ఇప్పటికైనా కార్మిక సమస్యలను పరిష్కరించండి.. లేదంటే సమ్మె తప్పదు.. కార్మికులుగా హెచ్చరిస్తున్నామంటూ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎండీ.యాకూబ్‌పాషా, బల్లెం నాగయ్య ఐటీసీ యాజమాన్య వైఖరిపై మండిపడ్డారు. గురువారం రిలే దీక్షల్లో శీరపు శ్రీకాంతరెడ్డి, రామిశెట్టి లక్ష్మి, బోళ్ల సమ్మక్క, పట్రా సుమిత్ర, గంధం సిరి, సోమందుల నీలిమ పాల్గొనగా బీఆర్డీయూ జనరల్ సెక్రటరీ షేక్ అజీమ్, సీఐటీయూ జనరల్ సెక్రటరీ మల్లికంటి వెంకటేశ్వర్లు, బీఎంఎస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు దీక్షా శిబిరం వద్దకు వచ్చి కార్మికులకు పూలమాల వేసి దీక్ష చేస్తున్న కార్మికుల పోరాటానికి అండగా ఉంటామని తమ సంపూర్ణ మద్దతు కార్మికులకు ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ.. వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కాంట్రాక్టు కార్మిక జేఏసీ నాయకులతో ఐటీసీ యాజమాన్యం తక్షణం చర్చలు జరపాలని, చర్చలు జరిపే విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కార్మికుల ఆగ్రహజ్వాలకు యాజమాన్యం మసికాక తప్పదని, ఇప్పటికైనా యాజమాన్యం చర్చలకు పిలవకపోయినా, సమస్యలు పరిష్కరించకపోయినా సమ్మెకు దిగుతామని ఇది కార్మికులుగా తమ హెచ్చరిక అంటూ యాజమాన్య వైఖరిని ఖండించారు. తక్షణమే ఐటీసీ యాజమాన్యం తన వైఖరి మార్చుకుని జేఏసీతో చర్చలకు రావాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు చుక్కపల్లి బాలాజీ, ఆకిని సర్వేశ్వరరావు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.