టేకులపల్లి, ఏప్రిల్ 23 : భవిష్యత్ కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు టేకులపల్లి గ్రామంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 26న నిర్వహించనున్నారు. బ్రహ్మంగారి 333వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఆలయం శోభాయమానంగా ముస్తాబవుతోంది. వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా ఆదివారం ఈ నెల 26న ఈ మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశ్వకర్మ వంశానికి చెందిన పుణ్యదంపతులు ప్రకృతాంబ, పరిపూర్ణయాచార్యులకు పుత్రునిగా జన్మించిన వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబను వివాహమాడి, కాలజ్ఞానాన్ని రచించి భూత, భవిష్యత్, వర్తమాన విషయాలను జగత్తుకు తెలియజేశారు. 1693 సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి పొందిన స్వామి వారు భక్తుల ఆరాధ్యదైవంగా నిలిచారు.
ఈ నెల 26న పూజా కార్యక్రమాలు ఉదయం 6 గంటల నుండి ప్రాతఃకాల పూజలు, స్వామి వారి జెండా, చిత్రపటం, పల్లకి, పాదుకలను ఉరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారని, గణపతి పూజ, పుణ్యాహవచనాలు, ఉత్సవమూర్తులకు పంచామృత, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, సహస్రనామార్చన, మహానివేదన, మంత్రపుష్పం, మంగళ హారతులు, తీర్థప్రసాదాల పంపిణీ జరుగుతుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు మహా అన్నదానం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ మహోత్సవాలలో పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు భక్తులను కోరారు.