Yadadri | యాదాద్రి భువనగిరి, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఇండ్లు, భూములపై ప్రభుత్వం కన్నుపడింది. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వేలాది ఇండ్లను, ఏండ్ల కిందటే కొనుగోలు చేసిన భూములను కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఉన్నపళంగా నిషేధిత జాబితాలో చేర్చిం ది. దీంతో పైసాపైసా కూడబెట్టి కొన్న ఆస్తులు రాత్రికిరాత్రే వాళ్లవి కాకుండా పోయాయి. బాధితులు ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా, అధికార నేతలను వేడుకొంటున్నా ఫలితం దక్కడం లేదు..
యాదాద్రి-భువనగిరి జిల్లాలో గత ప్రభుత్వాలు పేదలకు ఇండ్లస్థలాలు పంపిణీ చేశాయి. వారు ఇండ్లు నిర్మించుకొని ఏండ్లుగా ఆయా స్థలాల్లోనే నివాసం ఉంటున్నారు. కొందరు అవసరార్థం అమ్ముకొన్నారు. ఇలా చాలా మేరకు ఇండ్లు పలుమార్లు చేతులు మారాయి. ఇంటి నంబర్లు, విద్యుత్తు, నల్లా కనెక్షన్.. ఇలా అన్నిరకాల అనుమతులు తీసుకొని, ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రశాంతంగా సాగుతున్న వారి బతుకులపై ప్రభుత్వం పిడుగు పడేసింది. ఈ ఏడాది జనవరిలో అధికారులు ఆయా ఇండ్లను ‘సెక్షన్ 22ఏ’ జాబితాలో చేర్చారు. ప్రభుత్వం పంపిణీ చేసిన సర్వేనంబర్లలోని స్థలాలు కూడా నిషేధిత జాబితాలో చేరిపోయాయి. కొన్నిచోట్ల ప్రైవేట్ ఇండ్లపైనా నిషేధం విధించారు. ఇలా మొత్తంగా యాదాద్రి-భువనగిరి జిల్లాలో 39,648 ఇండ్లు, 28,549 ఎకరాల భూములను పీవోబీలో పొందుపరిచారని చెప్తున్నారు.
అత్యధికంగా భువనగిరిలో 5,000 ఇండ్లు, తుర్కపల్లిలో 4,803 గృహాలను 22ఏలో చేర్చారు. ఆయా ఆస్తుల క్రయవిక్రయాలు, బదిలీలు, రిజిస్ట్రేషన్లు చేయకుండా ప్రభుత్వం అడ్డుకొన్నది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయకుండా, కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా నిషేధిత జాబితాలో ఎలా చేరుస్తారని బాధిత ప్రజలు ప్రశ్నించారు. నాలుగైదుసార్లు చేతులు మారిన ఇండ్లు కూడా పీవోబీలో పెట్టడమేందని మండిపడ్డారు. అప్పులుచేసి కొన్న ఇండ్లు, ప్లాట్లు నిషేధిత జాబితాలో చేరిపోవడంతో నాటి నుంచి పేదల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అత్యవసర సమయంలో ఆదుకుంటుందని భావించిన ఆస్తులు ఇప్పుడు ఎందుకూ పనికిరాకుండా పోయాయంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.
యాదాద్రి-భువనగిరి జిల్లాతోపాటు ఇతర చోట్ల భూములు, ఇండ్లు నిషేధిత జాబితాలో చేర్చడంపై ప్రజలు, విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలు ఆందోళన బాటపట్టారు. భువనగిరి మండలంని వడాయిగూడెం వంటి గ్రామాలకు గ్రామాలనే పీవోబీలో పెట్టడంతో ఊరి ప్రజలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ప్రభుత్వం అప్పట్లో స్పందించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరిగింది. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమాధానమిస్తూ ‘బాధితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. నిషేధిత జాబితా అంశంపై రెండు, మూడు రోజుల్లో హైలెవల్ కమిటీ వేస్తాం’ అని ప్రకటించారు. ఇప్పటివరకు ఆ కమిటీ పత్తాలేదని ఆ గ్రామస్తులు మండిపడుతున్నారు. బాధితులు ఇప్పటికే అనేకసార్లు ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వంటివారిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తహసీల్దార్ మొదలు కలెక్టర్ వరకు వినతిపత్రాలను అందించారు. అయినా ఇప్పటివరకు ఫలితం కనిపించడం లేదు.