హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు ఏర్పాటుపై వివరణ ఇవ్వాలని హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ట్రస్టు బోర్డు ఏర్పాటు కోసం దేవాదాయ శాఖ చట్టానికి తీసుకొచ్చిన సవరణలతోపాటు బోర్డు నియామకాలకు సంబంధించి ఈ ఏడాది జూన్ 30న జారీ అయిన జీవో- 392ను సవాలు చేస్తూ నాగిళ్ల శ్రీనివాస్, వ్యవస్థాపక ట్రస్టీ భాసరాయణి నరసింహమూర్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. జీవో 392తోపాటు తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ (సవరణ) చట్టం-2025 ద్వారా చేర్చిన 96, 97 సెక్షన్లను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు.
రూ.100 కోట్లకుపైగా వార్షికాదాయం ఉన్న దేవాలయాలకు ట్రస్టు బోర్డులను ఏర్పాటు చేసేందుకు కొత్త చట్టం అవకాశం కల్పించిందని, ట్రస్టు బోర్డులో ఎమ్మెల్యేతోపాటు వంశపారంపర్య ధర్మకర్త తదితరులను సభ్యులుగా నియమించే విధానాన్ని తీసుకొచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రతివాదులను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో, ట్రస్టు బోర్డు చైర్మన్ ఎం సత్యనారాయణరెడ్డి, బోర్డు సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ) వైస్‌చైర్మన్, ప్రధాన అర్చకులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.