Arvind Kejriwal : ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అంటే కోర్టు నియమాల ఉల్లంఘనే అంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ వి కామేశ్వర్ రావు, జస్టిస్ మన్మీత్ అరోరా ఆధ్వర్యంలోని బెంచ్ ఈ కేసును విచారిస్తూ, గురువారం నోటీసులు జారీ చేశారు.
అంతేకాదు.. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా సహా అన్నిరకాల ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ వంటి సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన అన్ని వీడియోలను తొలగించాలని ఆదేశించింది. ఇది ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన అంశం విచారణ సందర్భంగా జరిగింది. ఈ కేసుకు సంబంధించి జడ్జిని మార్చాలని కోరుతూ కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా కేజ్రీవాల్ స్వయంగా విచారణకు హాజరై, నేరుగా జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో తన వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా వీడియోలు వ్యాప్తి చెందడం కోర్టులు, న్యాయవ్యవస్థ గౌరవాన్ని తగ్గించడమే అని కోర్టు అభిప్రాయపడింది. ఈ వీడియోలను పోస్ట్ చేసిన జర్నలిస్ట్ రవిష్ కుమార్, ఇతర వ్యక్తులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.