తిరుమలాయపాలెం, ఏప్రిల్ 23 : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వరి, మొక్కజొన్న పంటలను అమ్ముకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. రోడ్ల వెంబడి పంట రాశులు పోసి కాంటాలు వేసేందుకు మండుటెండల్లో పడిగాపులు కాస్తున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న, వరి పంటలు కొనుగోలు చేసేందుకు అధికారులు జాప్యం చేస్తున్నారని, వారాలు గడిచిన ధాన్యం కాంటాలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తెచ్చి వారం రోజులైనా ఇంతవరకు కాంటాలు వేయలేదని బంధంపెళ్లి రైతులు తమ బాధలను వెలిబుచ్చారు. మండలంలోని పిండిప్రోలు, దమ్మాయిగూడెం, బచ్చోడు, బీరోలు, జూపెడ తదితర కేంద్రాల్లోనూ మండుటెండల్లో రోడ్ల వెంబడి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు పడిగాపులు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో పంటలను త్వరితగతిన కొనుగోలు పూర్తి చేసి కాంటాలు వేయాలని రైతులు కోరుతున్నారు.