Lawrence Bishnoi | ఇండియన్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘లారెన్స్ ఆఫ్ పంజాబ్’ అనే డాక్యుమెంటరీ సిరీస్‌పై పంజాబ్‌లో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ వెబ్ సిరీస్‌ను నిషేధించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, లుధియానా ఎంపీ అమరీందర్ సింగ్ రాజా పంజాబ్, హర్యానా హైకోర్టులో పిల్ (PIL) దాఖలు చేసినట్లు తెలుస్తుంది. ఈ సిరీస్ నేరస్తుడిని హీరోగా చిత్రీకరిస్తోందని, ఇది పంజాబ్ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాజా వారింగ్ మాట్లాడుతూ.. తన ప్రాణస్నేహితుడు, ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలాను బిష్ణోయ్ గ్యాంగ్ పొట్టనబెట్టుకుందని గుర్తుచేసుకున్నారు. అటువంటి ఘాతకానికి పాల్పడిన గ్యాంగ్‌స్టర్‌పై డాక్యుమెంటరీ తీయడం బాధితుల కుటుంబాలను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. పంజాబ్ అంటే భగత్ సింగ్ వంటి వీరులు, రైతులు, సైనికుల పురిటిగడ్డ అని, గ్యాంగ్స్టర్ల అడ్డా కాదని ఆయన స్పష్టం చేశారు. నేరాలను గ్లామరైజ్ చేస్తూ రూపొందించిన ఇటువంటి కంటెంట్ సమాజానికి ప్రమాదకరమని, ఏప్రిల్ 27న జీ5 (Zee5) ఓటీటీలో విడుదల కానున్న ఈ సిరీస్‌ను వెంటనే అడ్డుకోవాలని ఆయన కోరారు. మరోవైపు, ఈ సిరీస్ పట్ల పంజాబ్ పోలీసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.