రవీంద్రభారతి, నవంబర్ 3: రాష్ట్ర బంద్‌తో బెంబేలెత్తిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీ ఉద్యమాన్ని చీల్చడానికి భారీ కుట్రలు చేస్తున్నారని బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆరోపించారు ఖబడ్దార్.. బీసీ నేతలను డబ్బు సంచులతో కొనాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. సోమవారం బషీర్‌బాగ్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎత్తరి భీమ్రాజ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం భారీ ఎత్తున మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
మంగళవారం నుం చి ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ రిజర్వేషన్ల సాధన నిరాహార దీక్షలు చేపడుతున్నట్టు తెలిపారు. నేపాల్, తెలంగాణ ఉద్యమ తరహాలో ఓయూ విద్యార్థులు ఉద్యమించి ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వకుండా తరమికొట్టాలని పిలుపునిచ్చారు. 42% రిజర్వేషన్లు పార్టీపరం గా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు.
పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ బీసీ రిజర్వేషన్లపై ఒక్కసారి కూడా ఎందుకు చర్చకు తీసుకొని రాలేదని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలనుకుంటే తక్షణమే ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో కొట్లాడి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్పించాలని, లేకుంటే సీఎం రేవంత్‌రెడ్డి బీసీల ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. 18న జరిగిన బంద్‌లో పాల్గొన్న బీసీ నేతలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.